ఈ ఏడాది కరెంట్ ఖాతా మిగులు!
2000 కోట్ల డాలర్లు ఉండొచ్చు
2006-07 తొలి త్రైమాసికం తరవాత ఇప్పుడే
చమురు ధరల క్షీణత వల్లే
బార్క్లేస్ అంచనా
ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి భారత్ రికార్డు స్థాయిలో 2000 కోట్ల డాలర్లు లేదా జీడీపీలో 0.7 శాతం మేర కరెంట్ ఖాతా మిగులును నమోదు చేయవచ్చు. కొవిడ్-19 సంక్షోభ కారణంగా దిగుమతుల క్షీణత కొనసాగుతుందన్న అంచనాలు ఇందుకు నేపథ్యమని విదేశీ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ఇంతవరకు మనదేశం భారీగా కరెంట్ ఖాతా లోటును ఎదుర్కొంటూ వస్తున్న సంగతి తెలిసిందే. చివరిసారిగా భారత్ 2006-07 తొలి త్రైమాసికంలో కరెంట్ ఖాతా మిగులును నమోదు చేసింది. అప్పట్లో ముడిచమురు ధర బాగా తగ్గడం ఇందుకు నేపథ్యమని బార్క్లేస్ పేర్కొంది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో ఏప్రిల్‌లో అటు ఎగుమతులు, ఇటు దిగుమతులు ఆల్‌టైం కనిష్ఠాలకు చేరాయి. పోర్టులన్నీ దాదాపు మూయడంతో ఎగుమతులు 60%, దిగుమతులు 59 శాతం క్షీణించాయి. దీంతో నాలుగేళ్ల కనిష్ఠ స్థాయిలో వాణిజ్య లోటు నమోదైంది.
మందగమనం పాలవుతున్న ఆర్థిక వ్యవస్థలో ఎగుమతులతో పాటుగా దిగుమతులు కూడా క్షీణిస్తున్నాయి. దీంతో 2018-19 తొలి అర్థభాగం నుంచి కరెంట్ ఖాతా లోటు తగ్గుతూ వచ్చింది. 2017-18లో 6600 కోట్ల డాలర్ల లోటు ఉండగా.. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 2700 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఈ తొలి త్రైమాసికంలో 3 బిలియన్ డాలర్లకు కరెంట్ ఖాతా లోటు పరిమితమవుతుందని అంచనా వేస్తున్నామని బార్క్లేస్ పేర్కొంది.. ‘అందుకే 2020-21లో జీడీపీలో 0.7 శాతం లేదా 1960 కోట్ల డాలర్ల మేర కరెంట్ ఖాతా మిగులు నమోదవుతుందని మా అంచనా. అంతక్రితం అంచనా 1000 కోట్ల డాలర్ల నుంచి దీనిని పెంచామ’ని చెప్పుకొచ్చింది. అయితే ఈ మిగులు కేవలం చమురు ధరలు క్షీణించడం వల్ల మాత్రమే నమోదైంది మినహా,. దిగుమతుల కంటే ఎగుమతులు పెరిగి కాదని.. అందుకే దీనిని ‘ఆహ్వానించలేని మిగులు’గా అభివర్ణిస్తున్నట్లు బార్క్లేస్ వివరించింది.