రైతులకు శుభవార్త: 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు!


అన్నదాతలకు శుభవార్త. వానాకాలం పంటలకుగాను కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పీ) కేంద్ర ప్రభుత్వం పెంచనుంది. 17 పంటలకు సంబంధించి మద్దతు ధరలను పెంచుతూ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సిఫారసులను త్వరలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, ప్రకటన చేస్తుందని చెప్పాయి.
కాగా.. సాధారణ వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.53 పెంచి ధరను రూ.1868గా ప్రతిపాదించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. నూనెగింజల పంటలకు కనీస మద్దతు ధరను ఎక్కువగా ప్రతిపాదించిందని, దిగుమతులను తగ్గించుకోడానికి వీలుగా నూనె గింజల సాగుకు రైతులను ప్రోత్సహించడం కోసం వీటికి మద్దతు ధరలు భారీగా పెంచాలని సూచించింది.
సీఏసీపీ ప్రతిపాదనలపై ఆహారానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలు సంప్రదింపులు జరుపుతున్నాయని, తర్వాత కేంద్ర కేబినెట్‌ ఆమోదానికి వెళ్తాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. సీఏసీపీ సిఫారసులను మంత్రివర్గం యథాతథంగా ఆమోదిస్తుంది.

About The Author