రెండవ పెళ్ళి మోజుతో.. పాముతో కాటెయించి భార్య హత్య


కొల్లాం: _మరో పెళ్లి చేసుకోవాలనే కోరికతో భార్యను పాముతో కరిపించి హత్య చేసిన దారుణ ఘటన కేరళ కొల్లాం​లో జరిగింది. నిందితుడు యూట్యూబ్​లో క్రైమ్​ చేయడం ఎలానో నేర్చుకుని… ఓ పథకం ప్రకారం ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడితో పాటు అతనికి సహకరించిన పాములు పట్టేవాడిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు._

ఓ వ్యక్తి తన భార్యను పాముతో కరిపించి చంపిన దారుణ ఘటన కేరళ కొల్లాం జిల్లా అంచల్​లో జరిగింది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా తేల్చారు.

అంచల్​ పట్టణానికి చెందిన ఉత్రా, సూరజ్ భార్యాభర్తలు. వీరి పెళ్లి సమయంలో సూరజ్​ 98 కాసుల బంగారం, నగదు కట్నంగా తీసుకున్నాడు. ఇప్పటికే చాలా బంగారం అమ్మేశాడు. కొన్నాళ్లుగా బాగానే ఉన్న సూరజ్​… తరువాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు అడ్డంగా ఉన్న తన భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనితో ఆమెను అనుమానం రాకుండా హత్య చేయాలని పథకం వేశాడు.
*యూట్యూబ్​లో క్రైమ్ పాఠాలు..:-* యూట్యూబ్​లో చూసి పాముల ద్వారా ఎలా హత్య చేయాలో నేర్చుకున్నాడు. తరువాత సురేష్​ అనే పాములవాడికి డబ్బులు ఇచ్చి పామును తీసుకున్నాడు. ఈ మార్చి 2న మొదటిసారిగా తన భార్య ఉత్రాపై హత్యాయత్నం చేశాడు. అయితే ఆమె సకాలంలో ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాలు దక్కించుకోగలిగింది. అయితే సూరజ్​పై ఎవరికీ అనుమానం కలగలేదు. దీనితో అతనికి మరింత ధైర్యం వచ్చింది. దీనితో మే 6న మరోసారి హత్యకు కుట్ర పన్నాడు.
*నిద్రపోతున్న భార్యపై..:-* సురేష్​ నుంచి ఓ పామును తీసుకున్న సూరజ్ దానిని బ్యాగులో దాచి ఉంచాడు. తరువాత ఇంటికి వచ్చి నిద్రపోతున్న భార్యపై ఆ పామును విసిరేశాడు. ఆ పాము ఉత్రాను రెండు సార్లు కాటువేసింది. ఆ తరువాత ఆ పామును ఓ కంటైనర్​లో బంధించాలని సూరజ్ ప్రయత్నించాడు కానీ కుదరలేదు. పాము ఇంటిలోని కబోర్డులోకి వెళ్లిపోయింది. దీనితో చేసేదేం లేక రాత్రంతా ఇంట్లోనే నిద్రపోకుండా ఉండిపోయిన సూరజ్​… ఉదయన్నే బయట వెళ్లిపోయాడు.
*కూతురు మృతిపై అనుమానం:-* ఉత్రా పాము కాటుతో మరణించడం.. ఇంతకు ముందు కూడా ఆమె పాముకాటుకు గురికావడంపై ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు సూరజ్​ను అదుపులోకి తీసుకుని… తమదైన శైలిలో విచారణ చేశారు. దీనితో సూరజ్ కుట్ర మొత్తం బయటపడింది.

About The Author