దేశం ఆశ్చర్యపోయేలా.. రైతులకు తీపికబురు…


దేశం ఆశ్చర్యపోయేలా.. రైతులకు తీపికబురు ‘కొండపోచమ్మ’ ప్రారంభంలో సీఎం కేసీఆర్‌ – 165 టీఎంసీల ప్రాజెక్టుల నిర్మాణం – ఇంజినీర్ల నైపుణ్యానికి తార్కాణం కాళేశ్వరం – నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది – ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో ఉద్యోగాలు – కూలీలకు పాదాభివందనం తెలంగాణ రైతాంగానికి త్వరలోనే పెద్ద తీపి కబురు చెబుతాం.. అది దేశం ఆశ్చర్యపోయేలా ఉంటుంది.. భూములు ఇచ్చి ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించిన నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి.. తెలంగాణ ఇంజినీర్ల నైపుణ్యానికి తార్కాణం కాళేశ్వరం ప్రాజెక్టు.. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ప్రాజెక్టు నిర్మాణం కోసం పని చేసిన వలసకూలీలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా” అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలంలో కొండపోచమ్మ సాగర్‌ జలాశయాన్ని చిన్నజీయర్‌స్వామితో కలిసి ప్రారంభించారు.అనంతరం విలేకర్ల సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. నిర్వాసితులు భూములు ఇవ్వడం వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందనీ, వారికి చేతులెత్తి మొక్కుతున్నానని అన్నారు. భూమితో ఉన్న అనుబంధాన్ని విడదీసినందుకు తనకు కూడా బాధ ఉందన్నారు. గజ్వేల్‌, సిద్దిపేటలో ఏర్పాటు చేసే ఫుడ్‌ప్రాసెసింగ్‌ పరిశ్రమలో నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌తో పాటు ఇతర జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం 165 టీఎంసీలు ఉంటుందని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ. లక్ష కోట్ల విలువైన పంటను తెలంగాణ రైతాంగం పండించబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం పదిచోట్ల లిఫ్టులు ఏర్పాటు చేశామనీ, దీని ద్వారా కొండపోచమ్మకు నీరు చేరుతుందన్నారు. కాళేశ్వరానికి 4800 మెగావాట్ల విద్యుత్తు వినియోగిస్తున్నట్టు చెప్పారు. సుమారు రూ.10 వేల కోట్ల మేర బిల్లులు వస్తున్నాయన్నారు. రైతుల నుంచి విద్యుత్‌ బిల్లులు, నీటి తీరువా బిల్లులను వసూలు చేయడం లేదన్నారు. గౌరవెల్లి, గండిపెల్లి, దుమ్ముగూడెం, గంధమాల, సమ్మక్క సారక్క తదితర ప్రాజెక్టులతో పాటు 40 టీఎంసీల బ్యారేజీలు నిర్మిస్తున్నామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించిన నిర్వాసితులు, కాంట్రాక్టర్లు, అధికారులు, వివిధ సంస్థలు కృషి వల్లే కొండపోచమ్మ ప్రాజెక్టు పూర్తయిందని తెలిపారు. మీడియా కూడా ఈ ప్రాజెక్టు విషయంలో ఎంతో సహకరించిందని గుర్తుచేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గజ్వేల్‌, సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్‌తో పాటు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ ప్రాంతాలకు సాగునీరు అందిస్తామన్నారు. మంజీరా, సింగూరు, హల్ది ప్రాజెక్టులు నింపుతామని చెప్పారు. మల్లన్నసాగర్‌ కోసం భూములు ఇచ్చిన ముత్రాజ్‌పల్లి నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సీఎం పర్యటన సాగిందిలా.. ఉదయం ఏడు గంటల 45 నిమిషాలకు సీఎం కేసీఆర్‌ దంపతులు కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చండీహోమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో అల్పాహారం అనంతరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభ కార్యక్రమానికి ఎర్రవల్లి గ్రామస్తులను సీఎం తన వెంటనే తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎర్రవల్లి, మర్కూక్‌లో రైతు వేదిక భవనాన్ని సైతం శంకుస్థాపన చేశారు. గంగాపూర్‌-యూసుఫ్‌ఖాన్‌పల్లి సర్పంచ్‌ గడ్డం ప్రసాద్‌ను, మర్కూక్‌ సర్పంచ్‌ అచ్చంగారి భాస్కర్‌ను సీఎం కేసీఆర్‌ బస్సులో ఎక్కించుకుని తన వెంట తీసుకుని ప్రాజెక్టు వద్దకు వెళ్లారు.

About The Author