వేయి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు : జులై 8న మరో 6 జిల్లాల్లో వర్తింపు – సీఎం జగన్


ఆరోగ్య శ్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోగానికి సంబంధించి ఖర్చు రూ. 1000 దాటితే..వారికి కూడా ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. 2020, జులై 08వ తేదీన ఆరు జిల్లాల్లో వర్తింపు చేస్తామని, మిగిలిన 6 జిల్లాలో దీపావళి, నవంబర్‌ 14 నుంచి అమలు చేయనున్నామని ప్రకటించారు.

ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌ అమలు జరిగిందిన, 2 వేలకు పైగా జబ్బులకు ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తున్నామన్నారు. ‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 2020, మే 29వ తేదీ శుక్రవారం వైద్య, ఆరోగ్య రంగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్..మాట్లాడుతూ…

రోగం వస్తే పేదవాడు అప్పుల పాలు కావొద్దని YSR ఆలోచించారనే విషయాన్న ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఆరోగ్య శ్రీని నీరుగార్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిల్లలను ఎలుకలు కొరికిన సందర్భాలున్నాయని, సెల్ ఫోన్ వెలుగుల్లో వైద్య చేసిన సందర్భాలున్నాయన్నారు. డాక్టర్లు, నర్సులు అంతంత మాత్రంగానే ఉండేవారన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చామని మరోమారు చెప్పారు. 1.42 కోట్ల కుటుంబాలు ఆరోగ్య పరిధిలోకి వచ్చినట్లు, నెట్ వర్క్ ఆసుపత్రులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 686 కోట్లు తీర్చామన్నారు. YSR ఆరోగ్య ఆసరా కార్యక్రమం చేపడుతున్నామని ఈ సందర్భంగా వెల్లడించారాయన. చికిత్స తీసుకున్న అనంతరం రోగి రెస్ట్ తీసుకొనే సమయంలో నెలకు రూ. 5 వేలు ఇవ్వడం జరుగుతోందన్నారు. 

About The Author