ఈ పోరులో అంతిమ విజయం వైద్యులదే: మోదీ


బెంగళూరు: కరోనా వైరస్‌పై పోరులో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. వైద్యులు సహా ఇతర సిబ్బందిని ఆయన సైనికులుగా అభివర్ణించారు. వారి కృషి వల్లే కరోనా వ్యాప్తి నివారణలో భారత్‌ ముందుందన్నారు. కంటికి కనిపించని శత్రువుపై డాక్టర్లు, నర్సులు అజేయంగా పోరాడుతున్నారని కొనియాడారు. ఈ పోరులో అంతిమ విజయం వైద్యులదే అని వ్యాఖ్యానించారు. కరోనాపై పోరులో ముందున్న వారిపై జరిగే ఎలాంటి దాడుల్ని సహించే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. కర్ణాటకలోని ‘రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌’ రజతోత్సవ వేడుకల్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో వర్సిటీ మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని మోదీ ఈ సందర్భంగా ప్రశంసించారు.  

ఈ సందర్భంగా ప్రధాని ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని గుర్తుచేశారు. ఈ పథకం కింద వైద్యుల కృషితో రెండు సంవత్సరాల్లో కోటి మందికిపైగా ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు దీనివల్ల అత్యంత లబ్ధిపొందారని వివరించారు. గత ఐదు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 22 ఎయిమ్స్‌లను నెలకొల్పేందుకు వేగంగా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. అలాగే ఎంబీబీఎస్‌లో 30 వేలు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో మరో 15 వేల వైద్య విద్య సీట్లను అదనంగా చేర్చామని తెలిపారు. ఇలా గత ఆరేళ్లలో దేశంలో వైద్యారోగ్య వ్యవస్థల్ని పటిష్ఠం చేసేందుకు పలు చర్యలు తీసుకున్నామన్నారు. ఆరోగ్య సంరక్షణా వ్యవస్థల్ని బలోపేతం చేయడం, అందరికీ వైద్య సదుపాయాల్ని అందుబాటులోకి తేవడం, వైద్య సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం, వీటన్నింటినీ యుద్ధప్రాతిపదికన అమలు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.  

About The Author