యూరిన్ లో మంట .. కారణం ఏమిటంటే …

యూరిన్ లో మంట .. కారణం ఏమిటంటే …

మూత్రం పోస్తున్నప్పుడు మంటగా ఉంటోంది, లోపల కారం పూసినట్టుగా అనిపిస్తోంది’. ఇవి చాలామంది చెప్పే మాటలే. దీనికి ప్రధాన కారణం మూత్రకోశంలో ఇన్‌ఫెక్షన్లు తలెత్తటం. వీటిల్లో తరచుగా కనబడేవి ఇ-కొలై ఇన్‌ఫెక్షన్లు. మూత్ర ఇన్‌ఫెక్షన్లు మగవారిలో కన్నా ఆడవారిలోనే ఎక్కువ. ఆడవాళ్లలో మూత్రమార్గం మలద్వారానికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల మలంలోని ఇ-కొలై వంటి బ్యాక్టీరియా తేలికగా మూత్రమార్గంలోకి వెళ్లే అవకాశముంటుంది. పైగా ఆడవాళ్లలో మూత్రమార్గం పొడవు చిన్నగానూ ఉంటుంది. దీంతో మూత్రాశయంలోకి బ్యాక్టీరియా త్వరగా ప్రవేశిస్తుంది కూడా. అలాగే లైంగిక సంపర్కం మూలంగానూ కొన్నిరకాల బ్యాక్టీరియా మూత్రకోశంలోకి చేరుకోవచ్చు. ఇవి ఇన్‌ఫెక్షన్‌కు దారితీయొచ్చు. దీంతో మంట, వెంటనే మూత్రానికి వెళ్లాల్సి రావటం, మూత్రం పోస్తున్నప్పుడు చివర్లో బాగా నొప్పి పుట్టటం వంటివి వేధిస్తాయి. అప్పుడప్పుడు రెండు మూడు చుక్కలు రక్తం కూడా పడొచ్చు. కొందరికి జ్వరం కూడా రావొచ్చు.
* మూత్ర ఇన్‌ఫెక్షన్లను అనుమానిస్తే ముందుగా మామూలు మూత్ర పరీక్ష చేస్తారు. చీము కణాలేవైనా ఉంటే ఇందులో బయటపడుతుంది. అనంతరం మూత్రం కల్చర్‌ పరీక్ష చేస్తారు. ఇందులో ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన బ్యాక్టీరియా కచ్చితంగా బయటపడుతుంది. కల్చర్‌ పరీక్షతో చిక్కేంటంటే- మూత్ర నమూనాను సరిగా పట్టకపోవటం. పరీక్ష కోసం మూత్రాన్ని పట్టే ముందు ఆడవాళ్లు జననాంగం వద్ద, మగవాళ్లు అంగం చివరి భాగాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. కొంత మూత్రాన్ని పోసిన తర్వాత మధ్యలో వచ్చే మూత్రాన్ని మాత్రమే పట్టాలి. అప్పుడే బ్యాక్టీరియా రకాలు సరిగ్గా తెలుస్తాయి. సాధారణంగా కల్చర్‌ పరీక్ష ఫలితాలు రావటానికి 48 గంటలు పడుతుంది. అందువల్ల అంతవరకూ వేచి చూడకుండా వెంటనే యాంటీబయోటిక్‌ మందులు ఆరంభిస్తారు. కల్చర్‌ పరీక్ష ఫలితాలు వచ్చాక అవసరమైతే మందులు మారుస్తారు. మామూలు ఇన్‌ఫెక్షన్లయితే వీటితోనే నయమైపోతుంది. అయితే కొందరికి ఇన్‌ఫెక్షన్లు సంక్లిష్టంగానూ ఉండొచ్చు. మంటతో పాటు వీపు కిందిభాగాన లాగుతున్నట్టుగా నొప్పి, తీవ్రమైన జ్వరం, చలి, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలు కూడా ఉంటే కారణమేంటన్నది గుర్తించటం తప్పనిసరి. ఇందుకు అల్ట్రాసౌండ్‌ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీలో, మూత్రాశయంలో రాళ్లు, మూత్రమార్గంలో అడ్డంకి వంటి సమస్యలేవైనా ఉంటే ఇందులో తెలుస్తుంది. మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవుతోందా లేదా అనేదీ బయటపడుతుంది.
* పిల్లల్లో మూత్ర ఇన్‌ఫెక్షన్లు తక్కువ. వస్తే మాత్రం సంక్లిష్టంగానే ఉంటాయి. సాధారణంగా మూత్రం వెనక్కి మళ్లటం (వసైకోయూరెత్రల్‌ రిఫ్లక్స్‌) పిల్లల్లో ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. మూత్రాశయం వద్ద మూత్రనాళం కలిసేచోట కవాటం సరిగా పనిచేయకపోవటం దీనికి మూలం. ఇది పుట్టుకతో వచ్చే సమస్య. వీరికి ముందుగా ఇన్‌ఫెక్షన్‌ తగ్గేందుకు యాంటీబయోటిక్స్‌ ఇస్తారు. సమస్య మామూలుగా ఉంటే వయసు పెరుగుతున్నకొద్దీ సరిదిద్దుకుంటుంది. తక్కువ మోతాదులో దీర్ఘకాలం యాంటీబయోటిక్స్‌ ఇవ్వటం ద్వారా ఇన్‌ఫెక్షన్లు రాకుండా నివారించొచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే సర్జరీ ద్వారా కవాటాన్ని సరిచేయాల్సి వస్తుంది.
ఆడవాళ్లలో మూత్ర ఇన్‌ఫెక్షన్లు సాధారణంగా చూసేవే కాబట్టి అంతగా పరీక్షల అవసరం ఉండకపోవచ్చు. అయితే ఏడాదిలో 3 కన్నా ఎక్కువసార్లు మూత్ర ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుంటే మాత్రం కారణమేంటన్నది లోతుగా పరిశీలించాల్సి వస్తుంది. అదే మగవారిలోనైతే ఒక్కసారి ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినా కారణమేంటన్నది నిశితంగా పరీక్షించాల్సి ఉంటుంది.`

About The Author