మనమధ్యలో దాగిఉన్న అపురూప స్థలాలు…
మనమధ్యలో దాగిఉన్న అపురూప స్థలాలు
పూర్వకాలం యుద్ధాలలో రాజులు యుద్ధమాతగా దుర్గారూపాన్ని ప్రతిష్టించి యుధ్ధంలో విజయం పొందడానికి యాగాలు చేసేవారు.ఇటీవల బాహుబలి సినిమాలో యుధ్ధానికి ముందు అమ్మవారికి బలి ఇవ్వడం అందరూ చూసే ఉంటారు.ఈ విధానం పూర్వకాలం నుండి వస్తున్నదే.అయితే దాదాపు 1300 సంవత్సరాలకు పూర్వం భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని ఏలి అతి పెద్ద రాజ్యాన్ని స్థాపించిన చాళుక్యరాజులు మన తెలుగు ప్రాంతాన్ని పాలిస్తుండేవారు.వీళ్ళు ఏలిన తెలుగుప్రాంతాన్ని “చాళుక్యవిషయం”అనేవారు.ఈ చాళుక్య విషయం తెలంగాణ,రాయలసీమలలో విస్తరించినది.అయితే వారు వారు రెండవ రాజధానిగా జడ్చర్ల వద్ద గంగాపురమును నిర్మించినారు.ఈ గంగాపురమునకు మాయాపురమనే పేరు కలదు.ఈ గంగాపురం చాళుక్యులు యుధ్ధాలు చేస్తున్నపుడు వారి రాజ్యానికి యుద్ధమాతగా ఒక దుర్గామాత దేవాలయాన్ని నిర్మించి ఆ మాతను మాయాపుర దుర్గమ్మ గా కొలిచేవారు.ఈమె అనుగ్రహం కోసం యుధ్ధాలు జరుగుతున్న రోజులంతా యాగాలు నడిచేవి.ఆ మాయాపుర దుర్గామాతనే ఈ మియాపురంలోని అమ్మవారు.ఈ అమ్మవారి అనుగ్రహం వల్ల చాళుక్యులు అనేక విజయాలు సాధించి నర్మదానదీ తీరం వరకూ రాజ్యాన్ని విస్తరించినారు.వీరి తర్వాత రాష్ట్రకూటులు ఈ ప్రాంతాన్ని ఏలుతున్న సమయంలో అంటే 9 వ శతాబ్ధంలో ఇక్కడ దేదీప్యమానమైన శివాలయం లకులీశ శైవ సంప్రదాయంలో నిర్మించినారు.అప్పుడే తూర్పుతీరాన్ని ఏలుతున్న చోళరాజులు ఈ ప్రాంతంలో వర్ధమానపురాన్ని (నందివడ్డెమాను) రెండవరాజధానిగా చేసుకొనిరి.వారి యుధ్ధమాతను విజయవాడ దుర్గా స్వరూపంగా ఇంద్రకల్లు లో స్థాపించిరి.మాయాపుర యుద్ధమాత మియ్యాపురలో ఉండగా ఇంద్రకీలాద్రిని ఏలుచున్న చోళరాజుల యుద్ధమాత ఇంద్రకల్లు లో ఉన్నది.ఈ రెండు స్థలాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉన్నాయి.ఇటువంటి దుర్గా స్వరూపాలు కేవలం ఈ ప్రాంతంలోనే ఉండటం గొప్పవిశేషం.ఈ రెండు స్వరూపాలను ఫోటోలో చూడండి.