ఈ నెల 22 నుంచి నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు – కేటీఆర్
ఈ నెల 22 నుంచి నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు – కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్
ఈనెల 22 నుంచి నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కె టి రామారావు పార్టీ శ్రేణులకు తెలిపారు. ఈరోజు పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో అనేక చోట్ల ఓట్లు గల్లంతు అంశం తమ దృష్టికి వచ్చిందని, దీనివల్ల పార్టీ అభ్యర్థులకు రావాల్సిన మెజార్టీ లు సైతం కొంత మేరకు తగ్గాయన్నారు. కొన్నిచోట్ల ఓటరు కార్డ్స్ ఉండి.. ఓటర్లు ఓట్లు వేయలేక పోయారని బాధపడ్డవారున్నారు .వాటిని పరిష్కరించాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం . పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు ప్రధాన కార్యదర్శులు తో కూడిన బృందం ఎలక్షన్ కమిషనర్ ను కలిసి ఈ విషయాన్ని చర్చిస్తుందని కేటీఆర్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ను కలిసిన తర్వాత కమిషన్ చేపట్టబోయే ఓటరు నమోదు పై పార్టీ శ్రేణులకు పలు మార్గదర్శకాలను సైతం విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఓటరు నమోదు పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరపాలని నిర్ణయం తీసుకున్నారు. 22 నుండి 24 వరకు జరిగే నియోజక వర్గ వారీ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శులు హాజరవుతారు . ఓటర్ల జాబితాను సవరించుకోవటమే ఎజెండా గా సమావేశాలు ఉండనున్నాయి. డిసెంబర్ 26 నుంచి జనవరి 6వరకు ఓటరు నమోదు లో చురుగ్గా పాల్గొనాలని పార్టీ శ్రేణులను ఈ సందర్భంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు.
దీంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన అంశం సైతం ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు సంబంధించిన స్థల సేకరణ జరిగిందని, త్వరలోనే కార్యాలయాలకు సంబంధించిన భవనాల నమూనాను పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ఆమోదించిన తర్వాత, కార్యాలయాల నిర్మాణ కార్యక్రమాలను మొదలుపెడతామన్నారు. జనవరి మొదటి వారం నుంచి పార్టీ కార్యాలయ నిర్మాణాలు ప్రారంభం కావాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.