21న వలయాకార సూర్య గ్రహణం

న్యూఢిల్లీ, : ఈ నెల 21న ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కరించనుంది. ఆ రోజు వలయాకార(యాన్యులర్‌) గ్రహణం కావడంతో.. సూర్యుడు మండుతున్న ఉంగరంలా వినువీధిన దర్శనమివ్వనున్నాడు. ఉదయం 9.15గంటలకు మొదలవనున్న గ్రహణం, మధ్యాహ్నం 3.04గంటలకు ముగియనుంది. పూర్తి గ్రహణం ఉదయం 10.17 గంటల నుంచి మధ్యాహ్నం 2.02నిముషాల దాకా కనిపిస్తుంది. ఈ ఏడాదికి ఇదే తొలి సూర్యగ్రహణం కావడం గమనార్హం.

ఏమిటీ వలయాకార గ్రహణం?

చంద్రుడు భూమి నుంచి అత్యంత దూరంలో ఉండే ప్రదేశాన్ని అపోజీగా వ్యవహరిస్తారు. అపోజీలో చంద్రుడు ఉన్నప్పుడు, భూమిపైకి సాధారణం కంటే కాస్త చిన్నగా కనిపిస్తాడు. ఆ తరుణంలో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు, సూర్యుడిని చంద్రుడు పూర్తిగా అడ్డుకోలేని పరిస్థితి ఉంటుంది.

చంద్రబింబం మూసినంత మేర మూయగా.. దాని చుట్టూ కనిపించే సూర్యబింబం మండుతున్న ఉంగరంలా కనిపిస్తుంది. దీన్నే యాన్యులర్‌ లేదా వలయాకార గ్రహణంగా పేర్కొంటారు. యాన్యులర్‌ అనే పదం లాటిన్‌లోని యాన్యులస్‌ అనే పదం నుంచి పుట్టింది.

అంటే ఉంగరం అని అర్థం. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో, హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాల్లోని దీవుల్లో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. మిగిలిన చోట్ల కేవలం పాక్షిక సూర్యగ్రహణంలాగే కనిపిస్తుంది. ఒక సెకను నుంచి 12నిముషాల వ్యవధి మధ్యలో ఈ వలయాకార గ్రహణ సమయం ఉండే అవకాశం ఉంది.

About The Author