ఈనాడులో కరోనా కలకలం…
ఏకంగా ఒకేసారి 16 మందికి కరోనా సోకినట్టు ఓ వార్త… మీడియా వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. సోమాజీగూడలోని ఈనాడు ప్రధాన కార్యాలయంలో రాండమ్‌గా 125 మందికి కరోనా టెస్ట్‌లు చేయిస్తే… అందులో 16 మందికి పాజిటీవ్ అని తేలింది. దాంతో.. యాజమాన్యం షాక్‌కి గురైంది. ఈ పదహారు మంది ఎవరెవరితో కాంటాక్ట్స్‌లో ఉన్నారు? అనే విషయాన్ని ఇప్పుడు ఆరా తీస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులకూ కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. ఈనాడు మరో కార్యాలయం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉంది. ప్రస్తుతానికి మేజర్ వర్క్ అంతా అక్కడి నుంచే జరుగుతోంది. ఫిల్మ్‌సిటీ ఉద్యోగులకు టెస్ట్ లు చేయిస్తే.. ఇంకెన్ని కేసులు బయటపడతాయో అని ఈనాడు యాజమాన్యం భయపడుతోంది. ఇప్పటికే ఫిల్మ్‌సిటీలోనూ 2 కేసులు నమోదైనట్టు సమాచారం. కేవలం 125 మందికి, అందునా రాండమ్ టెస్ట్ చేయిస్తే ఇన్ని కేసులంటే.. అందరికీ టెస్టులు చేయిస్తే, ఇంకెన్ని కేసులు బయటపడతాయో అనే భయం పట్టుకుంది. కరోనా భయాల మధ్య రిపోర్టర్లు, సబ్ ఎడిటర్స్ ఆఫీసులకు వెళ్లడానికే భయపడుతున్నారు. కానీ యాజమాన్యం మాత్రం వరుసగా సెలవలు తీసుకుంటున్నవాళ్లపై సీరియస్‌గా దృష్టి పెడుతోంది. వెళితే కరోనా భయం. వెళ్లకపోతే.. ఉద్యోగం పోతుందేమో అన్న ఆందోళన. ఈ రెండింటిమధ్య బతుకు వెళ్లదీస్తున్నారు ఈనాడు ఉద్యోగులు.