ఉపాధి కోసం దేశం కానీ దేశానికి వెళ్లిన ఓ తెలుగు వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య.

రియాధ్: ఉపాధి కోసం దేశం కానీ దేశానికి వెళ్లిన ఓ తెలుగు వ్య‌క్తి అనారోగ్య సమస్యలతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. నాలుగు డ‌బ్బులు సంపాదించి త‌న కుటుంబాన్ని బాగా చూసుకోవాల‌నే ఆశ‌తో సౌదీ అరేబియాకు వెళ్లిన తెలుగోడు చివ‌ర‌కు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన విషాద ఘ‌ట‌న ఇది. వివ‌రాల్లోకి వెళ్తే… ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి సమీపంలోని సీతానగరం గ్రామానికి చెందిన బత్సల శంకర రావు(38) ఉపాధి కోసం గతేడాది మార్చిలో సౌదీ వెళ్లాడు. అక్కడి ఓ ప్రైవేట్ కంపెనీలో వెల్డింగ్ పనికి కుదిరాడు. ఈ క్ర‌మంలో శంకర్ రావును కిడ్నీ, నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దాంతో అక్కడ ఉండలేక వెంటనే స్వ‌దేశానికి రావాల‌నుకున్నాడు. అయితే కరోనా లాక్‌డౌన్ వ‌ల్ల అది సాధ్య‌ప‌డలేదు.

దాంతో ఒక‌వైపు అనారోగ్య సమస్యలు, మరోవైపు భారత్‌లోని తమ కుటుంబసభ్యుల దగ్గరికి వెళ్లలేక పోతున్నాన‌నే మ‌నోవేద‌న అత‌డిని కృంగ‌దీసింది. జూన్ 15న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆసుపత్రిలో చేరాడు. ఆ త‌రువాతి రోజు కుటుంబ స‌భ్యుల‌తో ఫోన్‌లో మాట్లాడిన శంక‌ర్‌… త‌న బాధ‌ను వారితో పంచుకున్నాడు. ఆ సమయంలో తనకు బతకాలని లేదని, చనిపోతానని చెప్పాడు. దాంతో బంధువులు, కుటుంబ సభ్యులు అత‌నికి ధైర్యం చెప్పారు. అయినప్పటికీ అత‌నిలో మార్పు రాలేదు. అదే మాన‌సిక ఒత్తిడి కార‌ణంగా గురువారం ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డాడు. శంకర్ రావు మృతి చెందిన విష‌యం అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. శంక‌ర్ మర‌ణ‌వార్త‌తో కుటుంబీకులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు. ఎలాగైన మృతదేహాన్ని స్వ‌దేశానికి ర‌ప్పించాల‌ని వారు కోరుతున్నారు. 

About The Author