అద్దెకు రామోజీ ఫిల్మ్ సిటీ! హాట్ స్టార్ -డిస్నీతో మూడేళ్ల పాటు అద్దెకు ఒప్పందం…


ఎవరూ ఊహించని పరిణామం. రామోజీ ఫిల్మ్ సిటీ అద్దెకు ఇఛ్చేశారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీగా ఉన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ దెబ్బకు పెద్ద, చిన్న తేడాలు లేకుండా సినిమాలు అన్నీ అటెకెక్కాయి. చివరకు టీవీల షూటింగ్ లు కూడా బంద్. ఇప్పుడిప్పుడే టీవీల షూటింగ్ లు మళ్ళీ ప్రారంభం అయ్యాయి. లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఫిల్మ్ సిటీలో అన్ని కార్యకలాపాలు  బంద్. దాదాపు నాలుగు నెలలు  కావస్తోంది. పనులేమీ లేకపోవటంతో ఫిల్మ్ సిటీ యాజమాన్యం అక్కడ పనిచేసే సిబ్బందిలో దాదాపు అరవై శాతం ఉద్యోగుల వరకూ నో వర్క్-నో పే విధానాన్ని అమలు చేస్తోంది. తప్పనిసరిగా ఉండాల్సిన సిబ్బందిని మాత్రమే ఉద్యోగాలకు రానిస్తున్నారు. దాదాపు నాలుగు నెలలుగా ఫిల్మ్ సిటీ కార్యకలాపాలు నిలిచిపోవటం..కరోనా ఖతం అయ్యేది ఎప్పుడో ఎవరికీ క్లారిటీ లేకపోవటంతో ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తోంది. ఫిల్మ్ సిటీని మూడేళ్ళ పాటు హాట్ స్టార్-డిస్నీకి అద్దెకు ఇచ్చారు. కరోనా కారణంగా రామోజీ గ్రూప్ మొత్తం తీవ్ర ఆర్ధిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
అందులో భాగంగానే ఈనాడులో సైతం చాలా మంది ఉద్యోగులకు నిర్భంద సెలవుల విధానాన్ని అమలు చేస్తూ వేతనాల్లో కోతలు పెడుతున్నారు. ఆర్ధికంగా అంత లాభదాయకం కాని పలు విభాగాలకు ఇప్పటికే స్వస్తి పలికారు. ఇప్పుడు ఫిల్మ్ సిటీని కూడా అద్దెకు ఇచ్చేసి యాజమాన్యం సేఫ్ జోన్ లోకి వెళ్లినట్లు కన్పిస్తోంది రామోజీ ఫిల్మ్ సిటీ అద్దెకు ఇవ్వటం అనేది అత్యంత కీలక పరిణామంగా భావిస్తున్నారు. అయితే అద్దెకు తీసుకున్న హాట్ స్టార్-డిస్నీ సంస్థ ఇతర నిర్మాణ సంస్థల షూటింగ్ లకు  అనధికారికంగా అనుమతులు నిలిపివేస్తున్నట్లు ‘రిపబ్లిక్ వరల్డ్.కామ్’ తెలిపింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఫిల్మ్ సిటీని చేతిలో పెట్టుకోవటం ద్వారా రాబోయే రోజుల్లో సొంత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ తోపాటు ఇతర కంటెంట్ క్రియేట్ చేయటం ద్వారా  ఇతరుల కంటే చాలా మెరుగైన పొజిషన్ లో ఉంటామని ఆ కంపెనీ భావిస్తోంది. గత ఏడాది హాట్ స్టార్ ను డిస్నీ సేకరించిన విషయం తెలిసిందే. ఈ విలీనంతో హాట్ స్టార్ అత్యంత శక్తివంతమైన ఓటీటీ సంస్థగా అవతరించింది. ఇదిలా ఉంటే  ప్రపంచంలోనే అతి  పెద్ద బ్రాండ్ అయిన డిస్నీ ఫిల్మ్ సిటీని పర్యాటక పరంగా..సినిమా, షూటింగ్ ల కోసం ఉపయోగించుకోనుంది. ఈ ఒప్పందం తర్వాత ప్రాజెక్టులో మరెన్ని మార్పులు జరుగుతాయో వేచిచూడాల్సిందే.

About The Author