టిటిడి ఔట్సోర్సింగ్ సిబ్బందిని APCOSలో విలీన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలి
తిరుపతి, 03.06.2020ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్సింగ్ సర్వీసెస్(APCOS)లో ఔట్సోర్సింగ్ సిబ్బందిని విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరిస్తూ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఔట్సోర్సింగ్ సిబ్బంది టిటిడి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.
శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ చేపట్టాలని జాతీయ కార్మిక సంఘాలు, ఎన్జివోలు ఇచ్చిన పిలుపుమేరకు
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం వద్ద శుక్రవారం దాదాపు 1500 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ప్లకార్డులతో శాంతియుతంగా ధర్నా చేపట్టారు. సిఐటియుతోపాటు టిటిడిలోని ఎస్డబ్ల్యుఎఫ్, జెసిఏ యూనియన్, ఎస్సి, ఎస్టి ఉద్యోగుల అసోసియేషన్ తదితర ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.నాగార్జున మాట్లాడుతూ APCOSలో విలీనం చేస్తూ టిటిడి బోర్డు చేసిన తీర్మానాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి కోరారు.ఔట్సోర్సింగ్ కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ టైంస్కేల్ వర్తింప చేయాలని కోరారు. టిటిడి అటవీ కార్మికులకు, శ్రవణం సిబ్బందికి టైంస్కేల్ ఇచ్చిన టైంస్కేల్ అన్యాయమైందని, గోశాల, మార్కెటింగ్, వాహనబేరర్లకు ఇచ్చిన తరహాలో వీరికి టైంస్కేల్ వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. టిటిడిని నమ్ముకుని చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయడం తగదన్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది ఒకే క్యాడర్లో పనిచేస్తున్నా వేతనాల్లో వ్యత్యాసాలున్నాయని, వీటిని సరిచేయాలని హెచ్ఆర్ కమిటీ సిఫార్సు చేసిందని గుర్తు చేశారు.సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ టిటిడిలో భక్తులకు ఎనలేని సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు సిఐటియు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. టిటిడి స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు, ఎంప్లాయిస్ బ్యాంక్ డైరెక్టర్లు జి.వెంకటేశం, కాటా గుణశేఖర్ మాట్లాడుతూ టిటిడిలో ఎలాంటి నిధుల కొరత లేదని, APCOSలో విలీనం చేయకుండా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు టైంస్కేల్ వర్తింపచేయాలని కోరారు. యాజమాన్యం అంగీకరించని పక్షంలో రెగ్యులర్ ఉద్యోగులందరూ మద్దతుగా నిలుస్తామని తెలిపారు.టిటిడి జెసిఏ యూనియన్ ఛైర్మన్ జి.వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ టిటిడి సంస్థ అభివృద్ధి కోసం శాశ్వత ఉద్యోగులకు సమానంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి వారికి న్యాయం చేయాలని, వారికి పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు.టిటిడి స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ ప్రధానకార్యదర్శి నాగరత్నం మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చేలా టిటిడి యాజమాన్యం ముందుకు సాగాలని, ఇందుకోసం తమ యూనియన్ తరఫున మద్దతు ఇస్తామని వెల్లడించారు.
టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు హరిప్రసాద్, హరికృష్ణ మాట్లాడుతూ APCOSలో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కలసి కట్టుగా ఉండి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో టిటిడి సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సిఐటియు నాయకురాలు లక్ష్మి, టిటిడి కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.సుబ్రమణ్యం, , అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంఘం నాయకులు గంగులప్ప, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నేతలు రూప్ కుమార్, హరి, నిరంజన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
జారీ చేసినవారు,హరికృష్ణ,ప్రధాన కార్యదర్శి,టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం.