ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..APS RTC ఇక నుంచి టికెట్లెస్ ప్రయాణం..!
కరోనా వైరస్ నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు సరికొత్త యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ‘ప్రథమ్’ అనే పేరుతో ఏపీఎస్ఆర్టీసీ ఈ నూతన అప్లికేషన్ను ఆగష్టు 1న లాంచ్ చేయనుంది. సూపర్ లగ్జరీ సర్వీసుల దగ్గర నుంచి పల్లెవెలుగు బస్సుల దాకా అన్ని టికెట్లను దీని ద్వారానే బుక్ చేసుకునే వెసులుబాటును ప్రయాణీకులకు కల్పించనుంది.
ఇక ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ధరలో ఐదు శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి నగదురహిత లావాదేవీలను జరిపేందుకు వీలుగా ఈ ‘ప్రథమ్’ యాప్ను రూపొందించామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ను కూడా అప్గ్రేడేషన్ చేశారు. కాగా, ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,934 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.