ప్రైవేట్ హాస్పిటల్లో దారుణం.. ఒక్క రోజుకే లక్షా 15వేలు బిల్లు
హైదరాబాద్: కరోనాకు చికిత్స పేరుతో ఒక్క రోజులోనే లక్ష రూపాయలు బిల్లు వేసిన ఘటన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. పైపెచ్చు ఈ విషయాన్ని ప్రశ్నించిన రోగిని ఆసుపత్రి సిబ్బంది నిర్బంధించారు. నగరంలో సంచలనం సృష్టిస్తున్న ఘటనపై చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నగరంలోని ఫీవర్ ఆసుపత్రి డీఎంవో సుల్తానా కరోనా లక్షణాలతో చాదర్ ఘాట్ వద్ద ఉన్న తుంబే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే చికిత్స అందించిన ఆసుపత్రి వైద్యులు… ఆమెకు 24గంటలకు రూ.1.15లక్షల బిల్లు వేశారు. ఆ బిల్లు దెబ్బకు ఒక్కసారిగా షాక్కు గురైన ఆమె.. ఇదేంటని ప్రశ్నించారు. దీంతో సదరు ఆసుపత్రి యాజమాన్యం ఆమెను నిర్బంధించింది. సరైన చికిత్స అందించడం లేదని, ఆసుపత్రి వర్గాలు బాధిస్తున్నాయని వాపోయారు. అంత పెద్ద హాస్పిటల్ వైద్యురాలికే ఇంతలా ఇబ్బందులు ఎదురవుతుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.