అన్న‌దాత‌ల‌కు అనుకోని స‌త్కారం…

అన్న‌దాత‌ల‌కు అనుకోని స‌త్కారం

-https://www.facebook.com/groups/Wanaparthy/permalink/2452511788095525/

ఆశ్చ‌ర్యంతో అనంద‌భాష్పాలు రాల్చిన రైతులు
– కార్య‌క‌ర్త‌ల‌ స‌మావేశంలో ఉద్విగ్న వాతావ‌ర‌ణం
– ఎమ్మెల్యే ఇంత గొప్ప‌గా రైతుల‌ను గౌర‌వించ‌డంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం
– ఏడు మంది రైతుల‌కు స‌న్మానం, పాదాభివంద‌నం
– మ‌న‌స్ఫూర్థిగా నిరంజ‌న్ రెడ్డిని దీవించిన రైతులు

అక్క‌డ కార్య‌క‌ర్త‌ల స‌మావేశం. కొత్త‌గా గెలిచిన ఎమ్మెల్యే క‌దా పిలిస్తే వెంట‌నే వేల‌మంది త‌ర‌లివ‌చ్చారు. స‌మావేశం ప్రారంభం కాగానే ఎమ్మెల్యే లేచి మాట్లాడుతున్నారు. స్థానిక ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో ఏదో సందేశం ఇచ్చి పంపేస్తారు అని అంద‌రూ భావించారు. పార్టీ కార్య‌క‌ర్తల‌తో పాటు, వ‌చ్చిన ముఖ్య అతిధులు నేత‌లూ ఇదే అనుకున్నారు. కానీ వారు ఊహించిన దానికి అక్క‌డ అంతా భిన్నంగా జ‌రిగింది. స‌మావేశానికి వ‌చ్చిన వారిలో ఎనిమిది మంది రైతుల‌ను పిలిచి ఘ‌నంగా స‌న్మానించిన ఎమ్మెల్యే వారికి పాదాభివంద‌నం చేయ‌డంతో అనుకోని స‌త్కారంతో స‌మావేశంలో అంద‌రి మ‌న‌సులూ ఉప్పొంగి, ఉద్విగ్న వాతావ‌ర‌ణం క‌నిపించింది. వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల విస్తృత‌స్థాయి స‌మావేశంలో ఈ స‌న్నివేశం చోటుచేసుకుంది. వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి దీనికి కార‌కులు అయ్యారు. ఆదివారం జాతీయ రైతు దినోత్స‌వం. రైతుల‌నే ప‌ట్టించుకునే వారు లేరు. అలాంటిది ఓ స‌మావేశంలో ఈ రోజు రైతు దినోత్స‌వం అని గుర్తుకుచేసి, అక్క‌డికి వ‌చ్చిన రైతుల‌ను సన్మానించ‌డం అనేది ఎంతో అరుదు. ఇక పాదాభివంద‌నం కూడా చేస్తే ఆ రైతులు ఎంత ఆనంద‌ప‌డ‌తారో వేరుగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కార్య‌క‌ర్త‌ల స‌మావేశం మొద‌లుకాగానే ఎమ్మెల్యే నిరంజ‌న్ రెడ్డి రైతులు బీరం కృష్ణారెడ్డి, సందాపురం బుచ్చ‌న్న‌, ఉప్ప‌రి రంగ‌న్న‌, జామ్లా నాయ‌క్, ల‌క్ష్మీకాంత్ రెడ్డి, సుధాక‌ర్ రెడ్డి, విజ‌య‌ల‌క్ష్మి, నాగేంద్ర‌మ్మ‌ల‌ను వేదిక మీదికి ఆహ్వానించారు. అంద‌రినీ కూర్చోబెట్టి శాలువా, పూల‌దండ‌తో స‌న్మానించి పాదాల‌కు వంద‌నం చేశారు. దీంతో ఒక్క‌సారిగా రైతులు ఉద్వేగంతో పొంగిపోయి ఆనంద‌భాష్పాలు రాల్చారు. నిరంజ‌న్ రెడ్డిని గ‌ట్టిగా హ‌త్తుకుని మ‌స‌సారా ఆశీర్వ‌దించారు. ఎన్నో పార్టీల‌లో ప‌నిచేశాం. ఎన్నో డ‌బ్బులు సొంతంగా ఖ‌ర్చుపెట్టుకుని గెలిపించాం. ఎన్న‌డూ మాకు ఒక పూల‌దండ వేసిన‌ నాయ‌కుడు లేడు. ప‌ద‌వి ద‌క్కిన త‌రువాత మ‌ళ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌ట్టించుకున్న ప‌రిస్థితి కూడా ఉండేది కాదు. అలాంటిది ఇంత‌గొప్ప‌గా స‌న్మానించి, పాదాభివంద‌నం చేసే గుణం ఉన్న వ్య‌క్తి ఎమ్మెల్యేగా ల‌భించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని రైతులు ఆనంద‌భాష్పాలు రాలుస్తూ స‌మావేశం అనంత‌రం మీడియాకు వివ‌రించారు.

About The Author