నెల్లూరోడి ఘరానా మోసం…

నెల్లూరోడి ఘరానా మోసం..
భక్తి పేరుతో జనాలకు కుచ్చు టోపీ..

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన గిరీష్ సింగ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను భక్తి పేరుతో దారుణంగా మోసం చేశాడు. ఏకంగా 25కోట్ల రూపాయలు పోగేసుకుని ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. తన సోదరుడు దిలీప్ సింగ్ తో కలసి అద్వైత క్రియ పేరిట అనేక ప్రక్రియలు సృష్టించి భక్తుల సమస్యలు తీరుస్తానంటూ పెద్దపెద్ద హోటళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసేవాడు గిరీష్. బిలియనీర్‌ కావాలంటే కుబేర ప్రక్రియ, జీవితంలో సంతోషం కోసం అమృత ప్రక్రియ, ఆరోగ్యం కోసం ధన్వంతరి, పెళ్లి కోసం కల్యాణ ప్రక్రియ అంటూ నమ్మబలికాడు. తన మాటలకు ఆధ్యాత్మిక రంగు అద్ది పలు టీవీ ఛానళ్లలో పెయిడ్‌ కార్యక్రమాలతో పలువురిని ఆకర్షించాడు. ఒక్కొక్కరి దగ్గర రూ.75 వేల నుంచి రూ.2 లక్షలు వసూలు చేశాడు. 2017 జులైలో అమీర్‌పేటలో డ్రీమ్‌ బ్రిడ్జ్‌ అనే సంస్థను ప్రారంభించాడు. డ్రీమ్‌ బ్రిడ్జ్‌ సోషల్‌ ట్రేడ్‌ పేరుతో ప్రభుత్వ అనుమతి లేకుండానే మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ను ప్రారంభించాడు. నెలకు రూ.23 లక్షలు అద్దెతో మాదాపూర్‌లో నాలుగంతస్తుల భవనాన్ని తీసుకున్నాడు. తాను పెట్టబోయే 30 సంస్థల్లో వెయ్యి పెట్టుబడి పెడితే త్వరలోనే రూ.లక్ష సంపాదించవచ్చని ఆశ పుట్టించాడు. ఉన్నత చదువులు చదివిన సుమారు 350 మంది ఉద్యోగులను పెట్టుకున్నాడు. వీరికీ జీతాలివ్వలేదు. ఇతడిని అనుసరించే వారిలో సామాన్యుడి నుంచి కోటీశ్వరులూ ఉన్నారు. వీరంతా పెట్టుబడి పెట్టడంతో 41 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.25 కోట్లు పోగేసుకున్నాడు. రూ.కోట్లు ఖర్చు చేసి తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు. ఖరీదైన కార్లు, దేశవిదేశీ పర్యటనలతో జల్సాలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు గిరీష్ సింగ్ ని అరెస్టు చేశారు. అతడికి సహకరించిన సోదరుడినీ జైల్లోకి నెట్టారు.

About The Author