తిరుమల జలాశయాల్లో సమృద్ధిగా నీరు : టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి
పాపావినాశనం డ్యాం నిండి గేట్లు తెరచి నీటిని బయటకు వదలిన టిటిడి:
తిరుమల, 2020 జూలై 26: తిరుమలలోని జలాశయాల్లో రాబోవు 300 రోజుల వరకు పూర్తిస్థాయిలో భక్తులకు సరిపడా నీరు అందుబాటులో ఉందని టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని పాపావినాశనం జలాశయాన్ని ఆదివారం ఉదయం అదనపు ఈవో ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ సాధారణంగా తిరుపతి, తిరుమలలో ఈశాన్య రుతుపవనాల వలన అక్టోబరు, నవంబరు, డిశెంబరు నెలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. లోక కల్యాణార్థం కరోనా వైరస్ నివారించడానికి శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనం వేదికపై నెల రోజులకు పైగా నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణం వలన కార్యసిద్ధి కలుగుతుందని, దాదాపు 15 రోజులుగా నిర్వహిస్తున్న విరాటపర్వం పారాయణం వలన వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉంటుందన్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఈ సంవత్సరం జూలైలోనే తిరుమలలో విస్తారంగా వర్షాలు కురిశాయని, తిరుమలలోని డ్యాంలు 85 శాతం నిండినట్లు ఆయన తెలిపారు.
ఇందులో కుమారధారలో 98 శాతం, పసుపుధారలో 95 శాతం, ఆకాశగంగలో 30 శాతం, గోగర్భం డ్యాంలో 50 శాతం, పాపావినాశనం జలాశయంలో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయన్నారు.
ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నీటి నిల్వలు ఇంకా పెరుగుతాయని, అందువలన శనివారం రాత్రి నుండి పాపావినాశనం డ్యాం గేట్లు తెరచి నీటిని బయటకు వదిలినట్లు తెలియజేశారు. తిరుమలలోని నీటి అవసరాలకు పాపావినాశనం డ్యాం నుండి ప్రతి రోజు 30 లక్షల గ్యాలన్ల నీటిని పంపింగ్ చేయవలసిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి నీటి పారుదల విభాగం ఇఇ శ్రీ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.