కాన్సెప్ట్‌ సిటీగా ‘అనంత’ రూ.84.85 లక్షలతో ప్రణాళిక రూపకల్పన…


▪️ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
▪️సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే ‘అనంత’
పరిపాలన వికేంద్రీకరణకు అన్ని ప్రాంతాల అభివృద్ధిని ప్రధాన ప్రయోజనంగా చూస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాన్సెప్ట్‌ సిటీలు రూపొందించే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం నగరాలను కాన్సెప్ట్‌ సిటీలుగా ఎంపిక చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అనంతపురం కాన్సెప్ట్‌ సిటీ రూపకల్పనకు రూ.84.85 లక్షలతో పరిపాలన అనుమతులను స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవెన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాన్సెప్ట్‌ సిటీ ప్రణాళిక, పెట్టుబడుల ఆకర్షణ, వాణిజ్య వ్యూహాలకు అనుమతి ఇచ్చారు. ఈ ప్రణాళిక రూపకల్పనకు సీబీఆర్‌ఈ సౌత్‌ ఏషియా సంస్థను ఎంపిక చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అనంతపురం నగర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయనున్నారు. అనంతపురం నగరాన్ని కాన్సెప్ట్‌ సిటీగా ఎంపిక చేయడం పట్ల అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా అనంతపురం జిల్లాపై సీఎం జగన్‌ ప్రత్యేక ప్రేమ చూపిస్తున్నారని ఎమ్మెల్యే అనంత పేర్కొన్నారు. అనంతపురం నగరాభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని గతంలోనే పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారని, తాజాగా కాన్సెప్ట్‌ సిటీ ఎంపిక విషయంలో మంత్రి బొత్స చొరవ ఎంతగానో ఉందన్నారు. కరువుకు నిలయంగా ఉన్న అనంతపురం జిల్లాను సమగ్రాభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అనంత తెలిపారు. ఇప్పటికే సాగునీటి సమస్య లేకుండా చూడడానికి హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని 6 వేల క్యూసెక్కులకు పెంచేలా సీఎం నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. తాజాగా రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. తాజాగా అనంతపురం నగర అభివృద్ధికి ‘కాన్సెప్ట్‌ సిటీ’ ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఏడాది కాలంలోనే అనంతపురం నగర అభివృద్ధికి సుమారు రూ.60 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనంతపురం సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి గురించి ఎవరూ పట్టించుకోలేదని, ఇటీవల రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, ప్రాంతాల అభివృద్ధి విషయంలో సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని తెలిపారు. కాన్సెప్ట్‌ సిటీ వల్ల అనంతపురం మరింత అభివృద్ధి చెందుతుందని, అనంత ప్రజల తరఫున సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

About The Author