తెలంగాణ సర్కార్‌కి ఉత్తమ్ కొత్త సవాల్…
*హైదరాబాద్:* జీహెచ్‌ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ముందుగానే విన్నవిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఇందిరా భవన్‌లో జరిగిన సిటీ కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. డివిజన్ల విభజన హేతుబద్ధంగా ఉండాలన్నారు. అన్ని డివిజన్లలో ఓటర్లు సమానంగా ఉండాలని తెలిపారు. అర్హులైన ఒక శాతం మంది పేదలకు ఇళ్లు మంజూరు చేస్తే బల్దియా ఎన్నికల నుంచి కాంగ్రెస్ తప్పుకుంటుందని ఉత్తమ్ సవాల్ విసిరారు. అదే విధంగా సచివాలయంలో ఆలయం, మసీదు కూల్చివేతపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపాలిటీల్లో ఆగస్టు 24వరకు పార్టీ కమిటీలు పూర్తి చేయాలని ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. అనుబంధ విభాగాల కమిటీలు కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టును అనాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తీసుకువచ్చారని గుర్తుచేశారు. మూసీ ప్రక్షాళన ఆరేళ్లుగా కొనసాగిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఉస్మానియా ఆస్పత్రి కి ఒక్క రూపాయి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించలేదని దుయ్యబాట్టారు. తాను మంత్రిగా దిగిపోయే ముందు రూ. 200 కోట్లు మంజూరు చేస్తే ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు. (దుబ్బాక ఉప ఎన్నికపై టీపీసీసీ ప్రకటన)
ఉస్మానియా ఆస్పత్రి విషయాన్ని ఇంటింటికీ తీసుకువెళ్లుతామని అన్నారు. సచివాలయంలోని పవిత్రమైన దేవాలయం, మసీదు కూల్చివేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. సచివాలయం కూల్చివేత బాధ కల్గించిందని, అమూల్యమైన తెలంగాణ ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. కేసీఆర్ అసత్యాలు, అబద్ధాలు మాట్లాడుతున్నారని, కారు స్టీరింగ్ తమ చేతుల్లో ఉందని చెప్పిన ఎంఐఎం బ్రదర్స్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మసీదు, మందిర్ కూల్చివేతపై ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీ జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. మూడు పెద్ద నగరాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లోకి వెళతామని అన్నారు. బస్తీ దవాఖానాలు కేటీఆర్‌కు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అని ఎద్దేవా చేశారు. (మంత్రులు, అధికారులు భౌతిక దూరం పాటించాలి)
అదేవిధంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సచివాలయంలోని ఆలయం, మసీదు కూల్చివేత విషయాన్ని గ్రేటర్ ఎన్నికల్లో జనాల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. మందిర్, మసీదు కూల్చివేత ఎన్నికల అంశంగా కాకుండా సామాన్యుడి బతుకు దెరువుకు, భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా చూడాలన్నారు. బల్దియా ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్తి తన పరిధిలో కనీసం ఇద్దరిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సొంత నియోజకవర్గాలకు వదిలి ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని పలువురు నేతలు ఉత్తమ్‌ను కోరారు. ఈ సమావేశానికి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.