CM కె. చంద్రశేఖర్ రావు మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు…

ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు, పరిధిలోని మేడిగడ్డ బ్యారేజి, కన్నెపల్లి పంపుహౌస్‌లను సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించారు. అక్కడికక్కడే పలు సూచనలు చేశారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల నిర్మాణంతో పాటు పంపుహౌస్‌ల నిర్మాణం పనులు, మోటార్ల ఏర్పాటు పనులన్ని సమాంతరంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మార్చి 31 వరకు ప్రధానమైన పనులన్ని పూర్తిచేసి ఏప్రిల్, మే నేలల్లో ఇతర సమస్యలన్నింటిని పరిష్కరించుకుని ఎట్టి పరిస్థితుల్లోను జూన్ లో సాగునీరు అందించడానికి సిద్ధం కావాలని సీఎం సూచించారు. గోదావరిలో తెలంగాణ వాటా నీళ్లను వీలైనంత త్వరగా ఉపయోగించుకోవాలంటే, పంపుహౌస్‌ల నిర్మాణం, మోటార్ల బిగింపు ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. గోదావరికి రెండు వైపుల ఉండే ఫ్లడ్ బ్యాంక్స్ పనులను పరిశీలించిన కేసీఆర్, మట్టిపని రివిట్ మెంట్ పనులను పూర్తి జలాశయ మట్టం దాకా పూర్తి చేయాలని సూచించారు.

మేడిగడ్డ బ్యారేజ్ గేట్ల ఏర్పాటు పనులను, గేట్లను ఆపరేట్ చేసే విధానాన్ని పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ పనులను జనవరి నెలాఖరులోపల పూర్తి చేయాలని సీఎం సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్ కాంక్రిటు వర్క్ రోజుకు 10 వేల క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా చేయాలని వర్కింగ్ ఏజెన్సీని ఆదేశించారు. కన్నేపల్లి పంపుహౌస్ ఫోర్ బే, హెడ్ రేగ్యులేటర్ పనులను పరిశీలించిన సందర్భంగా, హెడ్ రేగ్యులేటర్ పనుల్లో ఉన్న సాంకేతిక లోపలను సవరించాలని సూచించారు. కన్నేపల్లి పంపుహౌస్ పనులను, 11 పంపులు బిగించే ప్రక్రియను మార్చి చివరి కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. సముద్ర మార్గంలో చెన్నై దాకా చేరుకుని, పోర్టులో వున్న మోటార్లను కూడా వెంటనే తెప్పించాలని అధికారులకు సూచించారు. నిధుల పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తిచేసే విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రజలు గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి చాటుకుంటుందని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సీఎంవో సెక్రటరీ ప్రతి పది రోజులకు ఒకసారి పర్యవేక్షిస్తారని సీఎం తెలిపారు. సబ్ స్టేషన్ పనులను పూర్తిచేయాలని ట్రాన్స్ కో సీఎండీ శ్రీ ప్రభాకర్ రావును సీఎం ఫోన్ లో ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట చీఫ్ సెక్రటరీ శ్రీ ఎస్.కె. జోషీ, డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ దివాకర్ రావు, శ్రీ శ్రీధర్ బాబు, టీఎస్ఎండీసీ ఛైర్మన్ శ్రీ శేరి సుభాష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీ వివేక్, సీఎం సెక్రటరీ శ్రీమతి స్మితా సబర్వాల్, నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ శ్రీ వి. ప్రకాష్, ఐడీసీ ఛైర్మన్ శ్రీ ఈద శంకర్ రెడ్డి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ శ్రీ మురళీధర్ రావు, సీఈ శ్రీ వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్ డి శ్రీ శ్రీధర్ రావు దేశ్ పాండే, లిప్ట్ సలహాదారు శ్రీ పెంటారెడ్డి, ఎల్ అండ్ టి సీఎండి శ్రీ సుబ్రమ్మణ్యన్, మెగా ఎండీ శ్రీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

About The Author