శబరిమల “వివాదం” గురించి, చర్చ జరగాల్సిన విధానం ఇదేనా?

#శబరిమల “వివాదం” గురించి, చర్చ జరగాల్సిన విధానం ఇదేనా?

సర్వోన్నత న్యాయస్థానం వారి ఇటీవల వ్యాఖ్యలతో, శబరిమల ఆలయంలోకి స్త్రీల ప్రవేశం గురించిన చర్చ మళ్ళీ మొదలయ్యింది. నేను ఆలయంలోకి స్త్రీల ప్రవేశాన్ని వ్యక్తిరేకించను, అలా అని సమర్ధించను కూడా. అయితే ప్రస్తుతం ఈ అంశం మీద, ముఖ్యంగా టీవీలలో, వార్తా పత్రికలలో జరుగుతున్న, చర్చల తీరును మాత్రం నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను.

శబరిమలలో స్త్రీల ప్రవేశం అనే అంశాన్ని ప్రత్యేకమైన అంశంగా, మిగిలిన వాటికి సంబంధం లేనిదిగా చూసే వారికి అసలు విషయం అర్ధం కాదు. హిందూ ధర్మంపై జరిగిన, జరుగుతున్న ఎన్నో దాడులలో ఇది కూడా ఒకటి. ఎలా అయితే ఇక్కడ విషయాన్ని, “స్త్రీ వివక్ష”, అన్న కోణంలో చూపాలి అని ప్రయత్నిస్తున్నారో, అలానే దీపావళి/హోళీ వంటి పండగలపై దాడులని “పర్యావరణం పై ప్రేమగా”, జల్లికట్టు, కోడి పందాలు వంటి వాటిపై దాడిని “జీవ కారుణ్యంగా” చూపే ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల పేర్లతో జరుగతున్న ఈ దాడుల లక్ష్యం మాత్రం, హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యడం, తద్వారా భారతదేశాన్ని నాశనం చెయ్యడం. తమ సంస్కృతి, సంప్రదాయాలకి దొరమైపోయిన హిందువును మతం మార్చడం కూడా సులభం.

శబరిమలలో స్త్రీల ప్రవేశం గురించి పోరాడుతున్న వారికి స్త్రీల మీద ప్రేమ ఉంది అనుకోవడం కంటే అమాయకత్వం మరోటి ఉండదు. మన దేశంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య, భర్తల తాగుడు అలవాటు. దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలని ఈ చెడు అలవాటు పూర్తిగా నాశనం చేస్తోంది. కానీ మన ఆధునిక స్త్రీవాదులు దీనిని వ్యతిరేకంగా మాట్లాడాల్సింది పోయి, సమానత్వం పేరుతో ఆడవాళ్ళు కూడా తాగాలి అంటారు. హిందూ ధర్మ నాశనం మిషనరీ వ్యాపారులకు లాభిస్తే, ఇది మద్యం వ్యాపారులకి లాభిస్తుంది. కోట్ల కుటుంబాలని నాశనం చేస్తున్న మధ్యపాన సమస్యని వదిలి, శబరిమలలో స్త్రీల ప్రవేశం గురించి పోరాడటం కాన్సర్ ని వదిలి చుండ్రుకి చికిత్స చెయ్యడం లాంటిది.

శబరిమల “వివాదం” పూర్తి వివరాలు ఏమిటి?

ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు శబరిమల అంశాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. శబరిమలలో ప్రవేశం లేనిది ఋతుచక్రం క్రియాశీలంగా ఉన్న స్త్రీలకి మాత్రమే, అందరికీ కాదు. దక్షిణ భారతీయులలో దాదాపు అందరికీ ఈ విషయం తెలుసు, కానీ ఉత్తర భారతీయులలో చాలా మందికి ఈ విషయం తెలియక పోవడం వలన, “అసలు స్త్రీలేవ్వరికీ శబరిమలలో ప్రవేశం లేదు” అన్నట్లుగా మీడియా చేస్తున్న ప్రచారాన్ని నమ్ముతున్నారు.

శబరిమలకి సంబంధించిన వివాదాన్ని సృష్టించిన వారు, ఈ అంశాన్ని, ఈ క్రింది కోణాలలో ప్రజల ముందు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు

1. శబరిమలలో స్త్రీల పట్ల వివక్ష
2. హిందూ దేవాలయాలలో స్త్రీల పట్ల వివక్ష
3. హిందూ ధర్మంలో స్త్రీల పట్ల వివక్ష
4. భారతదేశంలో స్త్రీల పట్ల వివక్ష

స్త్రీల శబరిమలగా పిలువబడే అట్టుక్కుల్ అమ్మన్ దేవాలయంలో జరిగే పొంగలం పండుగ దినాలలో పురుషులకి ప్రవేశం ఉండదు1. మరి ఇది పురుషుల పట్ల వివక్ష అందామా? అదీ కాక దేశంలో ఎన్నో వేల అయ్యప్ప ఆలయాలు ఉన్నాయి, వాటిలో ఎక్కడా ఇటువంటి నిబంధన లేదు. కాబట్టి శబరిమలలో ఉన్న నియమాన్ని స్త్రీల పట్ల వివక్ష అనుకోవడం చాలా పొరపాటు

మన దేశంలో ఎన్నో లక్షల దేవాలయాలు ఉన్నాయి, కానీ ఇటువంటి నియమాలు వేరెక్కడా లేవు. కాబట్టి హిందూ దేవాలయాలలో స్త్రీల పట్ల వివక్ష ఉంది అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది

మరే ఇతర మతంలో లేని విధంగా ధార్మిక మతాలలో, ముఖ్యంగా హిందూ ధర్మంలో దైవ శక్తిని స్త్రీ రూపంలో కూడా ఆరాదిస్తాము. “అమ్మవారి గుడి లేని ఊరు మనదేశంలో ఉండదు”, అనడం అతిశయోక్తి కాదేమో. కాబట్టి హిందూ ధర్మంలో స్త్రీల పట్ల వివక్ష ఉంది అనే ప్రచారం కేవలం దురుద్దేశ పూరితం.

స్త్రీలని గౌరవించడం అనేది మన సంస్కృతిలో ఒక ప్రధాన భాగం. కళ్ళు తెరిచి చూస్తె ఇది మన దేశం అంతా కనబడుతుంది. అలా తెరిచి చూడలేని వాళ్ళ కోసం గణాంకాలు ఉన్నాయి2.

ఋతుచక్రం క్రియాశీలంగా ఉన్న మహిళలు వెళ్ళకూడాడు అనడం తో పాటు శబరిమలలో మరెన్నో ప్రత్యేకనియమాలు ఉన్నాయి. దీక్ష తీసుకునే అయ్యప్పలు పాటించే కఠినమైన నియమాల గురించి తెలియని తెలుగువారు ఉండరు.

ఆగమ శాస్త్రం – దేవాలయ నిర్మాణాలకి సంబంధించిన శాస్త్రం

ప్రతీ హిందూ దేవాలయాన్నీ ఆగమ శాస్త్రాన్ని అనుసరించే నిర్మిస్తారు. ఇవి ముఖ్యంగా మూడు రకాలు. అవి శైవాగమము, వైష్ణవాగమము, శాక్త్యాగమము. ఎన్నో వందల ఆగమ శాస్త్రాలు ఉన్నా దాదాపు అవన్నీ ఈ మూడింటిలో ఎదో ఒకదాని పరిధిలోకే వస్తాయి. దేవాలయ నిర్మాణానికి సంబంధించి ప్రతీ చిన్న అంశం ఆగమశాస్త్రాలలో ఉంటుంది. ఎటువంటి భూమిని ఎంచుకోవాలి, ఎటువంటి శిలలు వాడాలి, గర్భాలయం ఏ దిక్కున ఉండాలి, ఉపాలయాలు ఎక్కడ ఉండాలి, ధ్వజస్తంభం ఎక్కడ ఉండాలి లాంటి అన్ని అంశాలూ ఆగమశాస్త్రంలో ఉంటాయి. ఇది చాలా లోతైన శాస్త్రం. ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్లు శిలలలో కూడా రకాలని గుర్తించగలరు. మనవంటి వారికి ఆశ్చర్యం కలిగించినా శిలలలో స్త్రీ, పురుష, నపుంసక అనే మూడు రకాలు ఉంటాయి. స్త్రీ దేవతా విగ్రహాల తయారీకి స్త్రీ శిలలు, పురుష దేవతా విగ్రహాల కొరకు పుం శిలలు, ఇతర నిర్మాణాల కొరకు నపుంసక శిలలు ఉపయోగిస్తారు. ఇవి మాత్రమె కాక, ప్రాణ ప్రతిష్ట ఏ విధంగా చెయ్యాలి, ప్రతిష్ట అయ్యాక ఎటువంటి నివేదనలు చెయ్యాలి, ఏఏ సమయంలో చెయ్యాలి, ఎంత పదార్ధం నివేదన చెయ్యాలి, ఎటువంటి అలంకారాలు ఎప్పుడెప్పుడు చెయ్యాలి, ఏ ఉత్సవాలు ఎప్పుడు, ఎలా చెయ్యాలి అనే అన్ని అంశాలూ ఆగమశాస్త్రమే నిర్ధారిస్తుంది. నెలసరి అవుతున్న స్త్రీలు శబరిమల వెళ్ళకూడదు అనే నియమం కూడా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విధించిందే.

శబరిమల స్థల పురాణం ప్రకారం, అయ్యప్ప స్వామి నిత్య బ్రహ్మచారి, శబరిమలలో జరిగిన ప్రతిష్ట, బ్రహ్మచారి ప్రతిష్ట. అటువంటి ప్రతిష్ట చేయ్యమని అయ్యప్పే చెప్పాడు అని స్థల పురాణం చెప్తోంది. ఇటువంటి ప్రతిష్ట జరిగిన ఆలయంలోకి నెలసరి అవుతున్న స్త్రీలు ప్రవేశించకూడదు అనేది ఆగమ శాస్త్ర నియమం. ఏ ఆగమశాస్త్రమైతే దేవాలయంలో దైవ శక్తీ నిక్షిప్తమై ఉంటుంది అని చెప్తుందో అదే ఆగమ శాస్త్రం కొన్ని నియమాలని కూడా పాటించాలి అని చెప్తోంది. దేవాలయంలో దైవ శక్తీ ఉంది అనేది నమ్మితే, నియమాలని కూడా నమ్మాలి. నియమాలపై నమ్మకం/గౌరవం లేకపోవడం అంటే, ఆగమశాస్త్రంపై, ఆ శాస్త్ర ఆధారంతో నడుస్తున్న దేవాలయ వ్యవస్థపై నమ్మకం/గౌరవం లేనట్లే. దేవాలయంలో దైవ శక్తీ ఉంది అని నమ్ముతాను కానీ, నియమ నిబంధనలని మాత్రం నమ్మను/గౌరవించాను అనడం ఆత్మవంచనే అవుతుంది. నేను వైద్య శాస్త్రాన్ని నమ్ముతాను కానీ, ఆ శాస్త్రం చెప్పిన పత్యాన్ని మాత్రం నమ్మను అనడం ఎలాంటి మూర్ఖత్వమో, ఇదీ అటువంటిదే.

అలా అని పరంపరాగతంగా వస్తున్న ప్రతీ నియమాన్నీ ఎప్పటికీ పాటించవలసినదే, మార్చడానికి వీలు లేదు అని నేను అనడం లేదు. కాలానుగుణంగా మారగలగడమే హిందూ ధర్మం యొక్క బలం. అయితే అటువంటి మార్పులు ధర్మం పరిధిలో జరగాలె కానీ, ఆధునిక, పాశ్చాత్య, స్త్రీవాద దృష్టి కోణానికి అనుగుణంగా కాదు. కాబట్టి నియమ నిబంధనలలో ఏ విధమైన మార్పులైనా చెయ్యాల్సింది ఆగమశాస్త్ర పండితులే కానీ టీవీ ఏన్కర్లో, పత్రికలలో వ్యాసాలూ రాసే “మేదావులో” కాదు. ఒక అణు రియాక్టర్ కి సంబంధించిన నియమాలని ఎలా అయితే అణు శాస్త్ర వేత్తలు నిర్ణయిస్తారో, అలానే దేవాలయ వ్యవస్థకి సంబందించిన విషయాలని కూడా ఆగమ శాస్త్ర పండితులే నిర్ణయించాలి.

రకరకాల ఆలయాలు – రకరకాల నియమాలు

ప్రతీ దేవాలయం విశిష్టమైనదే. ఒక్కో దేవాలయం ఒక్కో రకంగా నిర్మిస్తారు, అందువలన నియమాలు కూడా వేరు వేరుగా ఉంటాయి. ఉదాహరణకి శ్రీశైలం శివాలయం గర్భగుడిలోకి ఎవ్వరైనా వెళ్లవచ్చు, తమ చేతులతో శివుడికి అభిషేకం చెయ్యవచ్చు. స్నానం కూడా చెయ్యాలి అనే నియమంలేదు. చాలా మంది కొండ ఎక్కిన వెంటనే నేరుగా దర్శనానికి వెళ్ళిపోతారు. దీనినే దూళి దర్శనం అంటారు. అదే శ్రీకాళహస్తిలో శివుడుకి 10 – 15 అడుగుల దూరంలోనే ఆపేస్తారు. తమిళనాడు, కేరళలలో చాలా దేవాలయాలలోకి చొక్కాలతో వెళ్ళ నివ్వరు.

ఆగమ శాస్త్రం యొక్క శాస్త్రీయతని, శబరిమల గురించి న్యాయస్థానంలో పోరాడుతున్న వారు అంగీకరించక పోవచ్చు. ఆధునిక శాస్త్రీయ ప్రమాణాలకి లోబడి ఆగమశాస్త్రాన్ని ప్రమాణీకరించలేము. అలానే దేవాలయంలో దైవ శక్తీ ఉంది అని కూడా ప్రమాణీకరించలేము/నిరూపించలేము. ప్రస్తుతం అందరూ అనుసరిస్తున్న పాశ్చాత్య/ఆధునిక శాస్త్ర ప్రమాణాలకి లోబడి దేవాలయాలపై నిర్ణయాలు తీసుకునేలా అయితే దేవాలయాలనే పూర్తిగా కూల్చేయ్యవచ్చు. దేవాలయంలో దైవ శక్తీ ఉంది అని కానీ, ఆ మాటకొస్తే దేవుడున్నాడు, అని కానీ నిరూపించలేము. కాబట్టి ఆగమశాస్త్రాన్ని రద్దు చేసి, దేవాలయాలనన్నిటినీ తీసేసి వాటి స్థానంలో ఆసుపత్రులు, బడులు, సినిమా హాళ్ళు, మద్యం దుకాణాలు, జంతు వధ శాలలూ పెడితే సరిపోతుంది. శబరిమలకి సంబంధించిన నియమాలతో సహా, దేవాలయాలో పాటించే దాదాపు ఏ నియమాన్ని మనం ఆధునిక శాస్త్ర పరిధిలో నిరూపించలేము. ఇటువంటి వాటిని నిరూపించే స్థాయికి ఆధునిక శాస్త్రం ఇంకా ఎదగలేదు.

శబరిమలలో ఉన్న నియమాలని “స్త్రీ పట్ల వివక్ష” అంటున్నవాళ్లు విషయం పూర్తిగా తెలియని వారైనా అయ్యుండాలి, లేదా హిందూ ధర్మాన్ని భారతదేశాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న భారతవిచ్చితి శక్తులలో భాగమైన వారైనా అయ్యుండాలి. స్త్రీలని హిందూ ధర్మానికి దూరం చెయ్యడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో ఇది కూడా భాగమే

ఈ అంశం మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన “ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్” కి నౌషాద్ అహ్మద్ ఖాన్ గారు అధ్యక్షులు. ముస్లిం అయిన నౌషాద్ గారికి హిందూ దేవాలయ మీద ఎందుకంత ఆసక్తో ఎవరికీ వారే ఊహించుకోవచ్చు. ఇస్లాంలో ఉన్న ట్రిపిల్ తలాక్, బహుభార్యత్వం, నిఖాహలాలా వంటి వాటి మీద కూడా ఈయన పోరాటాలు చేస్తున్నారా లేదా ఈయన గారి కరుణ అంతా హిందూ మహిళల మీదేనా?

About The Author