పురిటినొప్పులు భరించి …
పరీక్ష రాసిన వెంటనే ప్రసవించి ..
ఆమె పట్టుదల ప్రశంసనీయం…

ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కొలువును సాధించాలనే కృతనిశ్చయంతో పురిటి నొప్పులను సైతం ఆమె పంటి బిగువన భరించింది. పరీక్షకు ముందుగానే నొప్పులు వచ్చే సూచనలు కనిపించినా విషయాన్ని భర్తకు కూడా తెలియనివ్వలేదు. పైకి చిరునవ్వులు చిందిస్తూ పరీక్ష కేంద్రానికి చేరుకుంది. పరీక్ష రాస్తుండగా నొప్పులు అధికమైనా.. అలాగే పూర్తిచేసి చివరలో స్పృహ కోల్పోయింది. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్తురాజుపాలెంలో గురువారం జరిగింది. కావలి మండలం తాగేటివారిపాళెం గ్రామానికి చెందిన థన్యాసి స్వాతి, మహేష్‌లు నిరుపేద దంపతులు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న మహేష్‌ కష్టపడితే గానీ కుటుంబం గడవని పరిస్థితి. దీంతో తన భార్య స్వాతిని ఆయన చదువులో ప్రోత్సహించారు. బుచ్చిరెడ్డిపాళెంలోని ఓ కళాశాలలో బీఈడీ పూర్తి చేయించారు. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం శిక్షణ కూడా ఇప్పించారు. డీఎస్సీ పరీక్ష కోసం ఆమె రేయింబవళ్లు కష్టపడి చదివింది. కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో డీఎస్సీ పరీక్ష గురువారం ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఉండడంతో భర్తతో పాటు ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకుంది. పరీక్ష రాస్తుండగా స్వాతికి పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి. బాధను దిగమింగి పరీక్ష రాసింది. పరీక్ష పూర్తైన వెంటనే ఆ పత్రాలను పరిశీలకుడికి ఇచ్చి స్పృహ కోల్పోయింది. కళాశాల ఛైర్మన్‌ పెనుబల్లి బాబునాయుడుకు విషయం తెలియడంతో తన కారులో ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలసుబ్రమణ్యం, నాగచైతన్య ఆమెకు కాన్పు చేయగా.. పండంటి మగబిడ్డ జన్మించాడు.

About The Author