తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు…
తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే
పుష్పయాగ మహోత్సవానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు శనివారం తిరుమలలో ఘనంగా జరిగింది.
తిరుమలలోని కల్యాణవేదిక వద్దగల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని 15వ శతాబ్దం నుంచి ఆలయంలో పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోందన్నారు. పూర్వపురోజుల్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగిన ఏడో రోజు స్వామికి పుష్పయాగం చేసేవారని చరిత్ర చెబుతోందన్నారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని 1980, నవంబరు 14న టిటిడి పునరుద్ధరించి ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణా నక్షత్ర పర్వదినాన నిర్వహిస్తోందన్నారు. శ్రీవారి పుష్పయాగానికి మొత్తం 7 టన్నుల పుష్పాలు, పత్రాలను వినియోగిస్తున్నామన్నారు. ఇందులో సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా పుష్పార్చన నిర్వహించనున్నట్లు తెలిపారు.
వేడుకగా స్నపన తిరుమంజనం
శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సందర్భంగా శనివారం ఉదయం రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేశారు. అక్కడ స్నపనతిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ జగన్మోహనాచార్యులు, ఎవిఎస్వోలు శ్రీ వీరబాబు, శ్రీ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
—————————————————————
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.