ఏపీ లోని పలు జిల్లాకు భారీ వర్ష సూచన
చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలో వాయుగుండం కొనసాగుతోంది. తిరుపతికి ఉత్తరంగా 35 కిలోమీటర్లు, నెల్లూరుకు నైరుతిగా 70 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయి ఉంది. కొద్ది గంటల్లో ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీయ జిల్లాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ఏపీలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.ఇక, గురువారం తెల్లవారుజామున తీరం దాటిన నివర్ తుపాన్ క్రమంగా బలహీన పడుతుంది.అయితే తీరం దాటే సమయంలో నివర్ విధ్వంసం సృష్టించింది. తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఏపీలో ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు అతలాకుతం చేశాయి. దీంతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
పలుచోట్ల రహదారులు వాగులను తలపిస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు నగరాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. పెన్నా, స్వర్ణముఖి, కైవల్య, కండలేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమశిల నుంచి 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రానికి వదులుతున్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి నాలుగు విమానాలను రద్దు చేశారు.తిరుమల ఘాట్ రోడ్డులో పలుచోట్ల కొండచరియలు విగిరిపడటంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.శ్రీవారి మెట్ల మార్గంలో బండరాళ్లు పడుతుండటంతో తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులను తిరిగి అనుమతించే విషయాన్ని తర్వాత తెలియజేస్తామన్నారు. రేణిగుంట-కడప జాతీయ రహదారి కోతకు గురైంది. మరోవైపు నివర్ తుపాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలోని హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. సుమారు మూడు మీటర్లు ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. కిలోమీటర్ మేర నీరు ముందుకు చొచ్చుకువచ్చింది. మూడు కిలోమీటర్ల మేర ఇసుకతిన్నెలు కోతకు గురయ్యాయి.