బిచ్చగాడి కృత్రిమ కాలిలో 96 వేలు డబ్బు…
బిచ్చగాడి కృత్రిమ కాలిలో 96 వేలు డబ్బు…
చనిపోయినతరువాత బయట పడింది..
బెంగళూరులోని కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ సమీపంలో పడి ఉన్న గుర్తు తెలియని మృతదేహాన్ని తరలించే సమయంలో అతని కృత్రిమ కాలు బరువుగా అనిపించడంతో తీసి చూడగా అందులో రూ.96,780 నగదు లభించింది. అతడి వివరాలు ఆరా తీయగా అతడి పేరు షరీఫ్ సాబ్‌గాను, స్వస్థలం హైదరాబాద్ అని బయటపడింది.
దాదాపు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి వెళ్లిన షరీఫ్ సాబ్ (75) బెంగళూరులో స్థిరపడ్డాడు. కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్‌పై చిన్న గుడిసె వేసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. కొన్నాళ్లు చిన్నా చితకా పనులు చేసినా ఆపై భిక్షాటనే వృత్తిగా మార్చుకున్నాడు. కాగా 12 ఏళ్ల క్రితం గాంగ్రిన్ కారణంగా షరీఫ్ కుడికాలు తొలగించి ఆ స్థానంలో కృత్రిమ కాలును ఏర్పాటు చేశారు. స్థానికులకు షరీఫ్ సాబ్‌గా సుపరిచితుడైన ఈ వృద్ధుడు తాను బిచ్చమెత్తుకోగా వచ్చిన డబ్బులో ఖర్చులు పోను మిగిలింది తన కృత్రిమ కాలులోనే దాచుకునే వాడు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ సమీపంలోని పబ్లిక్ టాయ్‌లెట్‌కు వెళ్లిన అతను అక్కడే హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని పరిశీలించిన రైల్వే పోలీసులు చనిపోయినట్లు నిర్థారించి హై గ్రౌండ్ ఠాణాకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై గాడ్గ్కే మృతదేహాన్ని శివాజీ నగర్‌లోని బౌరే ప్రభుత్వం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అతడి కృత్రిమ కాలు బరువుగా ఉండటాన్ని గుర్తించిన అతను స్థానికుల సాయంతో కాలును తీసి చూడగా… అందులో కరెన్సీ బయటపడింది. లెక్కించగా…మొత్తం రూ.96,780 లెక్కతేలింది. ఈ నగదును స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని బౌరే ఆస్పత్రిలో భద్రపరిచారు. షరీఫ్ తరచూ బౌరే ఆస్పత్రితో పాటు అక్కడి విక్టోరియా ఆస్పత్రికీ వెళ్లి వైద్యం చేయించుకునే వాడని తేలింది. దీంతో గాడ్గే్క ఆ రెండు ఆస్పత్రుల్లోనూ ఆరా తీయగా కొందరు సిబ్బంది, రోగులు షరీఫ్‌ను గుర్తించారు. తాను హైదరాబాద్‌కు చెందిన వాడినంటూ తమతో చెప్పే వాడని వారు పోలీసులకు తెలిపారు. అక్కడ ఉండే తన సోదరి సైతం కొన్నాళ్ల క్రితం చనిపోయిందని తమకు చెప్పాడని వివరించారు.
షరీఫ్ సాబ్ కుటుంబీకులు, బంధువులు, సంబంధీకులు ఎవరైనా హైదరాబాద్‌లో ఉంటే బెంగళూరులో ని హై గ్రౌండ్ పోలీసులను సంప్రదించాలని కోరారు.