చెరువులో విషప్రయోగం చేపలు మృతి…
చెరువులో విష ప్రయోగం చేసిన కారణంగా 20 వేల చేపలు మృతి చెందిన సంఘటన పీలేరు మండలంలో చోటు చేసుకుంది. బాధిత రైతు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరు మండలం, వేపులబైలు పంచాయితీలోని చెరువులకు నెల క్రితం జరిగిన వేలం పాటల్లో చంద్రశేఖర్ అనే రైతు రెడ్డి కుంటను వేలంలో పాడుకున్నాడు. అందులో సుమారు రూ.50 వేలు ఖర్చుచేసి 20 వేల చేపపిల్లలను చెరువులో పెంపకం కోసం వదిలాడు. రోజూ లాగే చంద్రశేఖర్ శనివారం ఉదయం చెఱువు దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో చేపలు మృతి చెంది చెరువులోని నీటిపై తేలుతున్న దృశ్యం చూసి ఖంగు తిన్నాడు. తానంటే గిట్టని వారెవరో శుక్రవారం రాత్రి చెరువులో విష ప్రయోగం చేసి ఈ దారుణానికి వడిగట్టి ఉంటారన్న అనుమానాన్ని బాధితుడు వ్యక్తం చేశాడు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన వేడుకొన్నాడు.