ఐస్‌క్రీమ్‌తో కరోనా వ్యాప్తి… 4,836 డబ్బాలలలో వైరస్!
బీజింగ్: కరోనా వైరస్‌కు సంబంధించి రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకూ కరోనా మనుషుల నుంచి వ్యాప్తి చెందుతుందని భావించారు. అయితే ఇప్పుడు ఆహార పదార్థాల ద్వారా కూడా కోవిడ్-19 వ్యాప్తి చెందుతుందనే వాదన రుజువయ్యింది. ఐస్ క్రీమ్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ఉదంతం ఇప్పుడు చైనాలో వెలుగు చూసింది. ఈ నేపధ్యంలో చైనాలోని పలు ప్రాంతాల్లో కలకలం మొదలైంది. అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక దుకాణాల్లో తయారైన మూడు ఐస్‌క్రీమ్ శాంపిళ్లలో కరోనా వైరస్‌ను కనుగొన్నారు.
ఈ ఉదంతం టియాంజిన్ మునిసిపాలిటీలో చోటుచేసుకుంది. టియాంజిన్ డాకియాడో ఫుడ్ కంపెనీకి చెందిన 4,836 ఐస్‌క్రీమ్ డబ్బాలలలో వైరస్ ఉందని కనుగొన్నారు. వాటిలోని 2,089 డబ్బాలను ఇప్పుడు స్టోరేజ్‌లో ఉంచి సీల్ చేశారు. చైనా మీడియా తెలిపిన వివరాల ప్రకారం కరోనా వైరస్ కలిగిన 1,812 డబ్బాలను మరో ప్రాంతానికి తరలించారు. మరో 935 డబ్బాలు స్థానిక మార్కెట్లోకి ప్రవేశించాయి. 65 డబ్బాలు ఇప్పటికే విక్రయమయ్యాయి. యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ వైరాలజిస్ట్ డాక్టర్ స్టీఫన్ గ్రాఫిన్ మాట్లాడుతూ ఐస్‌క్రీమ్ డబ్బాలలో కరోనా వైరస్ మనుషుల ద్వారానే ప్రవేశించింది. ఫలితంగా ఐస్‌క్రీమ్ ప్రొడక్షన్ ప్లాంట్ అంతా వైరస్ వ్యాప్తిచెందే అవకాశముందన్నారు. ఐస్‌క్రీమ్ అనేది ఫ్యాట్‌తో తయారవుతుంది. దానిని కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచుతారు. దీంతో అక్కడ వైరస్ వేగంగా వృద్ధి చెందుతుందన్నారు.