న‌గ‌ర‌వాసుల యాదిలోకి మరోసారి డబుల్‌ డెక్కర్‌ బస్సు


డబుల్‌ డెక్కర్‌ది నగరంతో మూడున్నర దశాబ్దాల బంధం
భాగ్యనగరానికి చార్మినార్‌ ఎంత ఫేమసో.. ఒకప్పుడు డబుల్‌ డెక్కర్‌ అన్నా అంతే క్రేజ్‌ ఉండేది. ఆ బస్సు ఎక్కేందుకు నగరవాసులు, జిల్లాల నుంచి వచ్చే వాళ్లు ఎంతో ఆసక్తి చూపేవారు. పైనున్న బస్సులో కూర్చొని ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేసేవారు.
1972లో తొలిసారి భాగ్యనగరాన్ని పలుకరించిన డబుల్‌ డెక్కర్‌ సిటీతో మూడున్నర దశాబ్దాల బంధం కొనసాగించింది. అప్పట్లో ఈ బస్సులు నగరానికి చాలా స్పెషల్‌గా ఉండేవి. సిటీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూడ్డమే గాక, ఒక్కసారైనా అందులో ప్రయాణించాలనే ఆసక్తి కనబరిచేవారు. నగర రోడ్లపై డబుల్‌ డెక్కర్‌ బస్సులో వెళ్తుంటే అంబారీపై వెళ్తున్నట్లు అనిపించేందని చాలామంది ఇప్పటికీ చెప్తుంటారు.
1972 సంవత్సరంలో నగరానికి ఏపీఎస్‌ఆర్టీసీ డబుల్‌ డెక్కర్‌ బస్సులను పరిచయం చేసింది. అలా వచ్చిన బస్సులు దాదాపు 34 ఏండ్ల పాటు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు ప్రత్యేక అనుభూతిని అందించాయి. 2006 సంవత్సరం అనంతరం అవి కనుమరుగయ్యాయి. నేటి తరానికి నగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సుల ప్రయాణం దూరమైంది.
కొద్ది రోజుల క్రితం.. ఓ నెటిజన్‌ డబుల్‌ డెక్కర్‌ జర్నీని గుర్తుచేసుకుంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేయడం, ఆయన స్పందించి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో నగరమంతటా ఆసక్తిని రేపింది. మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌.. నగరంలో డబుల్‌ డెక్కర్లు నడపడం మీద సాధ్యాసాధ్యాలను ఆర్టీసీ ఎండీతో మాట్లాడుతానని బదులివ్వడం మరింత చర్చనీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. సిటీలో మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సులా వస్తాయా అని పలువురు ఆసక్తిగా చర్చించుకున్నారు.
త్వ‌ర‌లోనే రోడ్ల‌పైకి డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు
హైదరాబాద్‌లో ఎన్నో ఏండ్ల కిందట నిలిచిపోయిన డబుల్‌ డెక్కర్‌ బస్సులను పునరుద్ధరించడంపై గ్రేటర్‌ ఆర్టీసీ దృష్టి సారించింది. నగరంలో పెరుగుతున్న పర్యాటక రంగం, అనేక కట్టడాలు వంటి వాటిని వీక్షిస్తూ ప్రయాణించేలా ఈ బస్సులను తీర్చిదిద్దుతున్నారు. నగరవాసుల అవసరాలకనుగుణంగా 50లోపు బస్సులను అన్ని ప్రధాన రూట్లలో నడిపించాలని భావిస్తున్నారు. అయితే పెరిగిన రద్దీ దృష్ట్యా నగరంలో పైవంతెనలు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిల సంఖ్య కూడా భారీగా పెరిగింది. తెలుగుతల్లి వంటి ఫ్లైఓవర్‌ లాంటి ప్రాంతంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపించడం ఇబ్బందిగా ఉందంటున్నారు. అయితే డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిరిగే ప్రాంతాలను ఆర్టీసీ అధికారులు ఇప్పటికే సర్వే నిర్వహించి నివేదిక రూపొందించారు. ప్రధానంగా కోఠి-పటాన్‌చెరువు, మెహిదీపట్నం-సికింద్రాబాద్‌ ప్రధాన రూట్లలో ఈ బస్సులను నడిపించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. బస్సుల సంఖ్య, తిరిగే మార్గాలు, ఆదాయ వ్యయాలపై ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ప్రభుత్వం ఆమోదించాల్సి ఉన్నదని ఆర్టీసీ గ్రేటర్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.
రెండు అంతస్థుల్లో 100మందికి పైగా..
ఒకప్పుడు సిటీ బస్సులకు తోడుగా డబుల్‌ డెక్కర్‌ బస్సులు నగర నలుమూలకు ప్రయాణికులను చేరవేసేవి. సాధారణ బస్సులో 43 మంది కూర్చుని ప్రయాణిస్తే.. డబుల్‌ డెక్కర్‌ బస్సులో కింది అంతస్తులో 34 మంది, పైఅంతస్తులో 32 మంది కూర్చొని వెళ్లేవారు. సిటీ బస్సుల్లో ఫుట్‌బోర్డు ప్రయాణాలు అప్పటి నుంచే ఉండేవి. డబుల్‌ డెక్కర్‌లో ఫుట్‌బోర్డుపై పదుల సంఖ్యలో ప్రయాణికులు నిల్చొని ప్రయాణించారు. అప్పటి యూత్‌ అదొక థ్రిల్‌గా ఫీల్‌ అయ్యేవారు.
రాణిగంజ్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌ డిపోల నుంచే..
అప్పట్లో డబుల్‌ డెక్కర్లు రాణిగంజ్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌ డిపోల నుంచే ఉండేవి. సికింద్రాబాద్‌ నుంచి అఫ్జల్‌గంజ్‌ వరకు ఏడో నంబర్‌ మార్గంలో, సికింద్రాబాద్‌ – చార్మినార్‌ వరకు ఎనిమిదో నంబర్‌, మెహిదీపట్నం – సికింద్రాబాద్‌ వరకు ఐదో నంబర్‌, సనత్‌నగర్‌ – చార్మినార్‌ తొమ్మిదో నంబర్‌, కోఠి నుంచి పటాన్‌చెరుకు 225వ నంబర్‌, సనత్‌నగర్‌ – సికింద్రాబాద్‌ వరకు పదో నంబర్‌ మార్గంలో నడిచేవి. పనుల మీద వెళ్లేవారితోపాటు సరదాగా డబుల్‌ డెక్కర్‌ ఎక్కేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా సెలవు రోజులు, వీకెండ్స్‌లో పర్యాటకులతో కిక్కిరిసేవి.

About The Author