టీడీపీ సర్వే లీక్.. చంద్రబాబుకు గట్టి షాక్


రాజకీయాల్లో సర్వేలంటే ఎవరికైనా చంద్రబాబు గుర్తురాక మానరు. తను అధికారంలో ఉన్నప్పుడు అయినదానికి, కానిదానికి తెగ సర్వేలు చేయించేవారు బాబు. ఏదైనా అంశాన్ని ప్రజలపై, అధికారులపై రుద్దాలనుకుంటే.. దానికి సర్వే ముసుగు తొడిగేవారు. అలాంటి చంద్రబాబుకు ఇప్పుడో సర్వే రివర్స్ లో తగిలింది. ఆ సర్వే కూడా ఆయన దగ్గరుండి చేయించుకున్నదే కావడం విశేషం.
అధికారం కోల్పోయినా సర్వేలు మాత్రం మానలేదు బాబు. ఈ విషయంలో పక్కకెళ్లి బాబును తిట్టుకునే టీడీపీ నేతలు 90శాతం మంది. ఇప్పటికీ ప్రతి అంశంపై సర్వేలు చేయిస్తూనే ఉన్నారు చంద్రబాబు. ఆ నంబర్లను తనకు అనుకూలంగా మార్చేసి, అనుకూల మీడియాతో బాకాలు ఊదుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు చేయించిన ఓ సర్వేకు సంబంధించిన అసలైన ఫలితాలు లీక్ అయ్యాయి.
ఈమధ్య కొన్ని ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేసే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించారు బాబు. అందులో బాబుకు దిమ్మతిరిగే వాస్తవాలు కళ్లకు కట్టాయి. 50 నియోజకవర్గాల్లో పార్టీకి ప్రాతినిధ్యమే లేదు.
మండల స్థాయిలో టీడీపీ జెండా మోసే నాధుడే లేడు. మరో 31 నియోజకవర్గాల్లో ఇంచార్జీలు ఉన్నా.. పార్టీ పనుల కంటే సొంత పనులతోనే వాళ్లంతా బిజీ. వాళ్లు పార్టీని ఎప్పుడో గాలికొదిలేశారు. వీటికి అదనంగా మరో 16 నియోజకవర్గాలకు ఇంచార్జీలే లేరు.

సర్వేతో పనిలేదు బాబు..!

ఇంచార్జీలు, ప్రాతినిథ్యాలు లేని నియోజకవర్గాలు, జిల్లాల సంగతి చాలామందికి తెలిసిందే. కానీ 31 నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలు, కీలకంగా వ్యవహరించాల్సిన నాయకులే లైట్ తీసుకున్నారంటూ సర్వేలో తేలడంతో చంద్రబాబు గతుక్కుమన్నారు.
గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ అంకెల్ని మార్చి నేతలతో టెలీకాన్ఫరెన్స్ పెడదామనుకున్న టైమ్ కే ఈ సర్వే ఫలితాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. పటిష్టంగా కనిపించే టీడీపీ సోషల్ మీడియా వింగ్ లోనే ఈ లీకేజీ కనిపించింది.
నిజానికి టీడీపీ పరిస్థితేంటో చెప్పడానికి, నియోజకవర్గ-జిల్లా స్థాయిలో నేతలు ఎలా పనిచేస్తున్నారు, క్యాడర్ ఎలా ఉందో చెప్పడానికి ఈ సర్వేలు అక్కర్లేదు. ఏ నాయకుడితో మాట్లాడినా, చిన్న ఫోన్ కాల్ చేసినా విషయం అర్థమైపోతుంది. కాకపోతే పార్టీని పట్టించుకోకుండా ఉన్న నాయకులు ఇంత భారీ సంఖ్యలో ఉన్నారనే విషయం, ఈ సర్వేతో బాబుకు తెలిసొచ్చింది.

మరి లోకేష్ పరిస్థితేంటి…?

పార్టీని పూర్తిగా గాడిలో పెట్టి, రెండో శ్రేణి నాయకత్వాన్ని సిద్ధం చేసి, అప్పుడు పగ్గాల్ని తనయుడు లోకేష్ కు అప్పగించాలని చంద్రబాబు కలలుకంటున్నారు. అయితే బాబు ఎంతగా పరితపిస్తున్నారో.. క్యాడర్ అంతగా చేజారిపోతోంది.
క్షేత్రస్థాయిలో ఇప్పటికే చాలామంది జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో, వైసీపీకి షిఫ్ట్ అవ్వగా.. జగన్ పెట్టిన కండిషన్స్ వల్ల చాలామంది ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారు.
ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ కు పార్టీని అప్పగిస్తే, టీడీపీని మరో టైటానిక్ షిప్ చేయడం లాంటిదే. అందుకే కిందామీద పడుతున్నారు చంద్రబాబు. ఇలాంటి టైమ్ లో లీక్ అయిన సొంత సర్వే ఫలితాలు.. అటు బాబును, ఇటు లోకేష్ ను మరింత ఇరకాటంలో పడేశాయి.

About The Author