ఉక్కు మంట అంటుకుంది…కమలానికి కలవరమే….?
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదానికి ఉన్న పవర్ ఉత్తరాది వారికి ఈనాటి తరానికీ తెలియకపోవచ్చు కానీ సౌతిండియా మొత్తం ఒకనాడు మారుమోగిన పవర్ ఫుల్ స్లోగన్ అంది. అందుకే ఏమీ కాకుండా చాలా సైలెంట్ గా విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్నామంటూ కేంద్ర పెద్దలు తాంబూలాలిచ్చేశారు.
ప్రత్యేక హోదా మాదిరిగానే దీన్ని కూడా ఎవరూ పట్టించుకోరు, వీధుల్లోకి రారు అన్న ధీమా కాబోలు. కానీ కేంద్ర పాలకుల నిర్ణయం పట్ల ఒక్కసారిగా విశాఖ భగ్గుమంది. విశాఖలో ఉక్కు మంట పెద్ద ఎత్తున రాజుకుంది. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్ని పార్టీలు ముక్తకంఠంతో నినదించాయి. కామ్రెడ్స్ అయితే కదం తొక్కి మరీ కేంద్రంతో అమీ తుమీ తేల్చుకుంటామని హెచ్చరించాయి.
విశాఖ ఉక్కు అంటే మీకు పరిశ్రమ మాత్రమే కావచ్చు. కానీ అది అఖిల ఆంధ్రుల సెంటిమెంట్. ఆ మంటను రాజేస్తే రైతు ఉద్యమం కంటే అతి పెద్దదే దక్షిణాదిన వచ్చి తీరుతుంది అంటున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.
లోక్ సభలో విశాఖ ఉక్కు ప్రైవేట్ చేయడంపైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజల పక్షాన నిలబడతామని, అక్కడే అన్నీ తేల్చుకుంటామని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇతర వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో వైసీపీ గళం విప్పుతామని గట్టిగానే గర్జిస్తున్నారు.
విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడం బీజేపీ తరం కాదని సీపీఎం నేత సీహెచ్ నరసింగరావు అంటున్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ సైతం విశాఖ ఉక్కుని కాపాడాలంటూ అర్జంటుగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలసి వినతిపత్రం ఇవ్వడం ఈ మంటలు రాజేసిన సెగలే కారణమని వేరే చెప్పనక్కరలేదు.
మొత్తానికి ఉత్తరాదిన రైతు ఉద్యమం చాలదా ఇపుడు ఉక్కు పేరిట మరో ఉద్యమాన్ని రాజేయాలా అని బీజేపీ పెద్దల మీద గట్టిగానే ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఉక్కు మంటలు చల్లారాలంటే కేంద్రం వెంటనే తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని అంతా డిమాండ్ చేస్తున్నారు.