సరస్వతి దేవి వేదకాలం…

సరస్వతి దేవి వేదకాలం నుండి అర్చామూర్తిగా ఋషీశ్వరులచే స్తుతించబడుతోంది. సృష్టికి ఆధారమైన ప్రణవనాదం “ఓం” కారం నుండి సర్వవిద్యలు ఉత్పన్నమయాయి. ప్రణవం సరస్వతీరూపం. అందుకే సకల విద్యలకు ఆధారంగా, ఆధిదేవతగా సరస్వతీ పూజింపబడుతోంది. సృష్టికారకుడైన బ్రహ్మ యొక్క సంకల్పశక్తి సరస్వతి. ఆ శక్తికే వాక్, వాణి, శారద,సరస్వతి అనే నామాలు.

?వేదాలకు ఆదిమూలమైన సరస్వతి దేవి విద్యా, వివేకాల దివ్యతత్వం. “సరస్” శబ్దానికి, ప్రవాహం, చలనం అని అర్థం. అందుకే సరస్వతిదేవి బ్రహ్మ యొక్క చైతన్యశక్తిగా అన్వయింపబడుతోంది. జీవరాశులలో మాట్లాడే శక్తి గల వారి నాలుకపై వసించు దేవి సరస్వతి. సరస్వతీ సూక్తంలో ఆమె మహాసరస్వతిగా నుతింపబడింది. పరిజ్ఞానాన్ని, విముక్తి ప్రసాదించు తల్లి సరస్వతి.

?సరస్వతీ దేవివాహనం హంస. పాలను, నీళ్ళను వేరు చేయగల శక్తి ఒక్క హంసకే ఉందని చెబుతారు. అంటే, ప్రపంచంలో సదసత్తులను విడదీసి, సద్వస్తువైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని అర్థం. వీణను ధరించిన ఆమె నాదరూపిణి. ఆమె దేహం రంగు తెల్లని తెలుపు. పరిపూర్ణ పరిశుద్ధ తత్వానికి, ప్రశాంతతకు గుర్తు. తెలుపు అన్ని వర్ణాల సమిష్టిరూపం. సరస్వతి దేవిసకల విద్యల సమిష్టిమూర్తి. వివిధ శక్తి స్వరూపాలతో కొలువబడుతున్న పరాశక్తి స్వరూపం పరాశక్తి స్వరూపం వర్ణానాతీతం. శివశక్తి – ‘శివా’, విష్ణుశక్తి – ‘లక్ష్మి’, బ్రహ్మశక్తి ‘వాణి’, ‘కు’ అను మాయను నశింప జేయు ‘కుమారి’, చండముండులను సంహరించిన “చాముండేశ్వరి”, దుష్టశిక్షణ చేయు ‘చండిక’. విశ్వంలోని సర్వశక్తుల సమ్మేళనం ఆ తల్లి అమ్మలగన్న ‘అమ్మ’.

About The Author