ఇంటికి మూడు కిలోల చికెన్ బంపర్ అఫ్ఫార్….


ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మూడో దశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో మూడో దశ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. పల్లెల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. డబ్బులు, మందు, చీరలు ఇలా ఎవరికి తోచింది వారు పంపిణీ చేస్తూ ఓట్లు తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. ఈక్రమంలో కొన్నిచోట్ల అభ్యర్థులు ఓ అడుగు ముందుకేసి నచ్చింది తినమంటూ ఆఫర్ ఇస్తున్నారు. అనంతపురం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇంటింటింకీ మూడు కిలోల చికెన్, అది వద్దంటే ఎకంగా కోళ్లనే పంచిపెట్టారు. చికెన్ ను నేరుగా ఇళ్లకు తీసుకెళ్లి పంచకుండా ముందుగా టోకెన్లు ఇచ్చి చికెన్ షాపుకు వెళ్లి తెచ్చుకునేలా ఏర్పాట్లు చేశారు.అనంతపురం జిల్లా ఉరవకొండ మండల వ్యాప్తంగా ప్రధాన పార్టీల మద్దతుదారులు చికెన్ పంపిణీ చేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే ఇంటింటికీ వెళ్లి టోకెన్లు పంచిన నేతలు.. చికెన్ షాపుకు వెళ్లి ఆ టోకెన్ ఇస్తే అందులో ఎంత ఉంటే అంత అక్కడే ముక్కలుగా కొట్టి ఇచ్చేలా అభ్యర్థులు ఏర్పాట్లు చేశారు. అటు చికెన్ వ్యాపారులు కూడా ఎన్నికల పుణ్యమా అని బిజినెస్ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుందని చెప్తున్నారు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే ఒక్కో చికెన్ షాపులో కనీసం వంద కిలోల వ్యాపారమైనా సాగుతుంది. అలాంటిది ఊరుఊరందిరికీ చికెన్ ఆర్డర్ రావడంతో గ్రామాల్లోని ఒక్కో చికెన్ వ్యాపారి దాదాపు 200 కిలోలకు పైగా సప్లై చేసినట్లు తెలుస్తోంది.

About The Author