పోర్న్‌ చూస్తున్నారా?.. మెసేజ్‌ వస్తుంది!


ఇంటర్‌నెట్‌లో పోర్న్‌ వీడియోలు చూసే వారిపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు నిఘా పెట్టనున్నారు. ఇకపై ఎవరైనా పోర్న్‌కు సంబంధించిన విషయాలను ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేస్తే ‘యూపీ ఉమెన్‌ పవర్‌లైన్‌ 1090’కు అలర్ట్‌ వెళ్లిపోతుంది. దీంతో 1090నుంచి సదరు వ్యక్తికి అవగాహాన కల్పించే విధంగా ఓ మెసేజ్‌ వస్తుంది. ఆరు జిల్లాల్లో విజయవంతమైన ఈ ప్రాజెక్టుకు ప్రజలనుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు.దీనిపై ఏడీజీ నీరా రావత్‌ మాట్లాడుతూ.. ‘‘ ఇంటర్‌నెట్‌ వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో మహిళలపై నేరాలు అరికట్టడానికి 1090 దోహదపడుతుంది. డేటా యూసేజ్‌ ఆధారంగా ప్రజలు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారన్న దానిపై ఓ కన్నేసి ఉంచుతున్నాం. ఎవరైనా పోర్న్‌కు సంబంధించిన విషయాలు సెర్చ్‌ చేస్తే 1090కు సమాచారం అందుతుంది. వారికి అవగాహన కల్పించే విధంగా ఓ మెసేజ్‌ వెళుతుంది. వారి డేటా పోలీసులు, 1090 వద్ద నిక్షిప్తమై ఉంటుంది‌’’ అని అన్నారు.

About The Author