మీ పెళ్లి జరిగేటప్పుడు వర్షం పడిందా..? అయితే ఇది మీకోసమే..
వర్షాకాలం పెళ్లి మహూర్తాల పెట్టుకుంటే.. వాన రాకడ గురించి అనుమానించక్కర్లేదు. అదే.. మాంచి మండు టెండల్లో పెళ్లి పెట్టుకున్నా.. కొన్నిసార్లు మహూర్తం వేళకి నాలుగు చినుకులు పడిన సందర్భాలూ మనం చూస్తూ ఉంటాం. అలా పెళ్లి జరిగే సమయంలో వాన పడితే అది దేనికి సంకేతం. వధూ వరులకు ఆ వర్షం మేలు చేస్తుందా? లేక కీడు చేస్తుందా?
పెళ్లి జరుగుతున్న సమయంలో వర్షం కురిస్తే.. పెళ్లి చేసుకుంటున్న జంటకు శుభం జరుగుతుందనే నమ్మచం చాలా కాలంగా ఉంది. అయితే ఆ శుభం ఎలా జరుగుతుంది అంటే… పెళ్లి జరిగే సమయంలో వర్షం పడితే.. ఆ జంటకు సంతాన భాగ్యంలో ఎలాంటి అవాంతరం ఉండదట. అంతే కాదు.. పెళ్లి తర్వాత ఆ జంట సకల సంపదలతో తులతూగుతుందట. ఇక ఎంత పెద్ద వర్షం కురిస్తే.. అంత పెద్ద మంచి జరుగుతుందని కూడా అంటారు.
పెళ్లిరోజు పెళ్లి కూతురు ఏడిస్తే, అదృష్టం అని భావిస్తారు. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి ముందు వధువు ఇప్పుడు కన్నీటిని చిందిస్తే, పెళ్లి అయిన తరువాత ఎప్పుడూ ఏడవదు అని నమ్మకం. పెళ్లి రోజున గడప దాటే ముందే ఆమె ఏడిచే కన్నీరే చివరి కన్నీరు అని అంటారు.
పాలు దొర్లిపోతే అపశకునం..
పాలు దొర్లిపోతే కొన్నిసార్లు శుభశకునం అంటారు. అయితే పెళ్లి సందర్భంలో మాత్రం పాలు దొర్లిపోతే అపశకునం అంటారు. పెళ్లికి ఒక రోజు ముందు లేదా తరువాత పాలు దొర్లితే ఆ దురదృష్ట చిహ్నాలు ఆ జంటపై ప్రభావాన్ని చూపిస్తాయని నమ్ముతారు. కాబట్టి, ఆ ప్రత్యేకమైన రోజున పాలు దొర్లకుండా చూసుకుంటారు.