ఒళ్లు కరిగించే మధుమేహ మాత్ర!


ఊబకాయులకు ఓ శుభవార్త. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒళ్లు తగ్గడం లేదన్న మీ బెంగ త్వరలోనే తీరబోతోంది. ఎందుకంటే మధుమేహానికి వాడే సెమాగ్లుటైడ్‌ అనే మందు శరీరాన్ని తగ్గించేందుకు భేషుగ్గా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆకలిని నియంత్రించే వ్యవస్థను తన అధీనంలోకి తీసుకోవడం ద్వారా ఈ మందు పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మందును వాడిన ఊబకాయుల్లో 33 శాతం మంది బరువు తగ్గారు. అది కూడా వారి శరీర బరువులో 20 శాతం వరకు తగ్గుదల నమోదు కావడం విశేషం.
ఈ ప్రయోగంలో పాల్గొన్న వారందరూ వారానికి ఒకసారి సెమాగ్లుటైడ్‌ ఇంజెక్షన్‌ తీసుకోవడమే కాకుండా బరువు తగ్గేందుకు సాధారణంగా ఆచరించే పద్ధతులన్నింటినీ కొనసాగించారు. సెమాగ్లుటైడ్‌ అనేది ఆకలి భావనను తగ్గిచేందుకు ప్రకృతిలో లభించే జీఎల్‌పీ–1 హార్మోన్‌ మాదిరిగా ఉంటుంది. 2017లో దీన్ని బరువు తగ్గించేందుకూ ఉపయోగించొచ్చా? అన్నది పరిశీలించి సానుకూల ఫలితాలు సాధించారు కూడా. అప్పట్లో 28 మంది ఊబకాయులకు ఈ మందు ఇవ్వగా, ఆకలి తగ్గిపోయిన కారణంగా 12 వారాల తర్వాత వీరి శరీర బరువు సగటున 5 కిలోల వరకు తగ్గింది.
ప్రస్తుతం మూడో దశ మానవ ప్రయోగాలు జరుగుతున్నాయి. 16 దేశాల్లోని 129 ప్రాంతాల్లో 2 వేల మందిపై ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. మొత్తం 68 వారాల పాటు ఈ ప్రయోగాలు జరగ్గా కొంతమందికి వారానికి ఒకసారి సెమాగ్లుటైడ్‌ ఇంజెక్షన్, మరి కొంతమందికి ఉత్తుత్తి ఇంజెక్షన్‌ ఇచ్చారు. ఉత్తుత్తి ఇంజెక్షన్‌ ఇచ్చిన వారు సగటున 2.6 కిలోల బరువు తగ్గగా, బాడీ మాస్‌ ఇండెక్స్‌ కూడా 0.92 వరకు తగ్గింది. సెమాగ్లుటైడ్‌ ఇంజెక్షన్‌ తీసుకున్న వారు సగటున 15.3 కిలోల బరువు తగ్గారు. బీఎంఐ తగ్గుదల 5.54గా నమోదైంది. గుండెజబ్బుకు కారణాలైన మధుమేహం, రక్తపోటు తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు.

About The Author