దేశంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ జన ఔషధి కేంద్రాలు..


దేశంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి సదానంద గౌడ చెప్పారు.

వీటి ద్వారా జనరిక్ మందులు అందుబాటు ధరకు సామాన్యులకు దొరుకుతాయని చెప్పారు.

బెంగళూరులో జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు తాము చికిత్స చేసే రోగులకు జనరిక్ మందులను సిఫారసు చేయాలని సదానంద గౌడ కోరారు.

ఓ అధ్యయనం ప్రకారం కుటుంబ ఆదాయంలో 15 నుంచి 30 శాతం వరకు మందులపై ఖర్చవుతున్నట్లు తెలిసిందని చెప్పారు.

దీనివల్ల ఏటా కోటి మందికి పైగా దారిద్ర్య రేఖకు దిగువకు వెళ్ళిపోతున్నారన్నారు.

జన ఔషధి దుకాణాల్లో బీపీ మాత్రలు రూ.250 నుంచి రూ.300కు లభిస్తాయని చెప్పారు.

బీపీ బ్రాండెడ్ టాబ్లెట్ల ధర రూ.2,500 నుంచి రూ.3,000 వరకు ఉంటుందని తెలిపారు.

ప్రజలకు నాణ్యమైన మందులు కనిష్ట ధరకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు.

వచ్చే నెలలో జన ఔషధి వారోత్సవాలు జరుగుతాయని, ఈ సందర్భంగా జన ఔషధి విక్రేతలు, లబ్ధిదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని తెలిపారు.

దేశవ్యాప్తంగా దాదాపు 7,500 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 850 కేంద్రాలు కర్ణాటకలో ఉన్నాయి.

About The Author