ఆండ్రాయిడ్ 12లో టాప్-5 ఫీచర్స్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తీసుకొచ్చిన అతి ముఖ్యమైన టెక్నాలజీలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రధానమైనది. ప్రతి ఏడాది వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను అప్డేట్ చేస్తూ వస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ 8న ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోని వచ్చింది. దీనిలో ప్రధానంగా ఛాట్ బబుల్స్, కన్వర్జేషన్ నోటిఫికేషన్స్, బిల్ట్-ఇన్ స్క్రీన్ రికార్డర్ వంటి కొత్త ఫీచర్స్‌ని ఆండ్రాయిడ్ యూజర్స్ కు పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ ఓఎస్ ఇంకా అందరికి అందుబాటులోకి రాలేదు. తాజాగా ఆండ్రాయిడ్ 12కి సంబందించిన కొన్ని ఫీచర్స్ బయటకి వచ్చాయి. వాటిలో ప్రధానమైన 5 ఫీచర్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.
సరికొత్త థీమ్స్:
గతంలో ఉపయోగించిన థీమ్ రంగులకు భిన్నంగా రాబోయే ఆండ్రాయిడ్ 12లో సరికొత్త పరిచయం చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ‘థీమింగ్ సిస్టం’ ఫీచర్‌ను కొత్త వెర్షన్‌లో తీసుకొస్తున్నట్టు సమాచారం. దీనితో యూజర్ తనకు నచ్చినట్టు ఓఎస్ థీమ్ రంగుని మార్చుకొనే అవకాశం ఉంది.
కొత్త యూఐతో నోటిఫికేషన్స్:
ఆండ్రాయిడ్ 12లోని నోటిఫికేషన్ సెంటర్‌లో కూడా మార్పులు చేస్తున్నారు. ‘మెటీరియల్ నెక్ట్స్’ డిజైన్ ఆకృతితో నోటిఫికేషన్ సెంటర్‌ను తీసుకోని రానున్నారు. ఇందులో యాప్ నోటిఫికేషన్లతో పాటు ఆండ్రాయిడ్ బిల్ట్-ఇన్ యాప్స్ అప్‌డేట్లు సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ (యూఐ)తో కనిపిస్తాయి. నోటిఫికేషన్ కోసం ఎక్కువ స్థలం కాకుండా తక్కువ స్థలం తీసుకొనేలా రూపొందించారు.మెసేజింగ్ యాప్‌ల కోసం ప్రత్యేకంగా ‘కన్వర్సేషన్స్’ పేరుతో విడ్జెట్స్ తీసుకొస్తున్నారు. వీటిలో మనం యాప్ ద్వారా చివరిగా ఎవరితో సంభాషించామనేది తెలుస్తుంది. అలా ప్రతి యాప్‌కి ప్రత్యేక విడ్జెట్ ఉంటుందని సమాచారం.
సింగల్ హ్యాండ్ మోడ్:
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని ఫోన్లకు స్క్రీన్ పెద్దదిగా వస్తున్నాయి. దీంతో కొన్ని సార్లు ఫోన్ వాడటం కూడా కష్టంగా ఉంటుంది. అటువంటి వారి కోసం ఆండ్రాయిడ్ 12లో ‘వన్ హ్యాండ్ మోడ్’ ఫీచర్ పరిచయం చేస్తున్నారు. ఇది ఫోన్ స్క్రీన్ నిలువు సైజ్‌ను తగ్గిస్తుంది. దీని సాయంతో యూజర్ ఫోన్‌ను సులభంగా ఆపరేట్ చేయవచ్చు.
ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం:
యాపిల్ ఐఓఎస్ తరహాలోనే గూగుల్ ఆండ్రాయిడ్ 12లో ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఇందుకోసం ఫోన్ పైభాగం చివర్లో యూజర్‌కి తెలిసేలా ఆరెంజ్, గ్రీన్ రంగుల్లో చిన్నపాటి గుర్తులు ఉంటాయి. ఆరెంజ్ రంగులో మైక్ సింబల్, గ్రీన్ రంగులో కెమెరా సింబల్ కనిపిస్తాయి. దీని వల్ల మీరు యాప్ ఉపయోగిస్తున్నప్పుడు మీ అనుమతి లేకుండా కెమెరా, ఫోన్ మైక్రోఫోన్ పనిచేస్తుంటే సులభంగా తెలిసిపోతుంది. అలాగే వైఫ్ షేర్ చేసుకోవడానికి కొత్తగా క్యూఆర్ కోడ్ ఆప్షన్ తీసుకోని వచ్చింది. దీనితో ఎదుటి వ్యక్తికి పాస్ వర్డ్ షేర్ చేయకుండా క్యూఆర్ కోడ్ చేస్తే సరిపోతుంది.
ఆటోమేటిక్ స్క్రీన్‌షాట్:
2019లో స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్స్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అయితే ఆండ్రాయిడ్ 10, 11 వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను తీసుకురాలేదు. తాజాగా స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్స్‌ని ఆండ్రాయిడ్ 12లో పరిచయం చేయనున్నారట. దీని సాయంతో యూజర్ స్క్రీన్‌షాట్ తీసిన వెంటనే దానంతటదే ఫోన్ స్క్రీన్ కిందకు జరిగి మరో స్క్రీన్‌షాట్ తీసుకుని రెండింటిని కలిపి చూపిస్తుంది.