దేశంలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్-19 కేసులు!
గత కొన్ని నెలలుగా అవరోహణ క్రమంలోనే సాగిన కోవిడ్-19 కేసుల నంబర్ లో మళ్లీ పెరుగుదల నమోదు కావడం గమనార్హం. దాదాపు నెల రోజుల తర్వాత నిన్న గరిష్ట స్థాయిని చేరింది రోజువారీ కోవిడ్-19 కేసుల సంఖ్య. ఏకంగా 14,059 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇది నెల రోజుల గరిష్టం.
జనవరి 23న దాదాపు ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తగ్గుముఖం పడుతూ వచ్చిన కేసుల్లో మళ్లీ పెరుగుదల చోటు చేసుకోవడం గమనార్హం. మహారాష్ట్రలో మళ్లీ కేసుల సంఖ్య బాగా పెరిగినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్ లలో మళ్లీ కేసుల సంఖ్య పెరిగినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.
ప్రజలు జాగ్రత్తగా ఉండటం లేదని, కరోనాను పూర్తిగా లైట్ తీసుకున్నారని చెప్పనక్కర్లేదు. క్రమంగా మాస్కులు ధరించే వారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాలు కూడా ఈ అజాగ్రత్తకు మినహాయింపు కాదు. కరోనా లాక్ డౌన్ కు పూర్వపు పరిస్థితులు దాదాపు వచ్చేశాయి. అన్నీయథాతథంగా సాగుతున్నాయి.
ఏపీలో అయితే పంచాయతీ ఎన్నికలు జరిగాయి, ఇక ఇతర స్థానిక ఎన్నికలు ఇప్పుడు సాగుతున్నాయి. ఇప్పటి వరకూ అయితే అక్కడ కొత్త కేసుల సంఖ్యలో పెరుగుదల ఏమీ లేకపోవడం ఊరటను ఇచ్చే అంశం. అయితే మహారాష్ట్రతో పాటు కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది.
అలాగే భౌతిక దూరం లేకుండా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న వారు కూడా సామూహికంగా కరోనా బారిన పడిన వార్తలూ వస్తున్నాయి. ఒకే అపార్ట్ మెంట్లో వందల మందికి కరోనా సోకిందనే వార్తలూ వినిపిస్తున్నాయి. కరోనా పూర్తిగా మటు మాయం కాలేదని ఈ వార్తలు స్పష్టతను ఇస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని చాటుతున్నాయి.