శిఖరాగ్రాన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు…


శిఖరాగ్రాన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన శిఖరంపై జిల్లా బాలిక రిత్విక శ్రీ
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన చిన్నారి పర్వత శిఖరంపై జాతీయ జెండాతో పాటు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చిత్రాన్ని ప్రదర్శించిన రిత్విక

జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు అందుకుంటున్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఖ్యాతి ఇప్పుడు ఖండాలు దాటింది. ఏకంగా ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతం కిలిమంజారో శిఖరాగ్రానికి ఆయన ఖ్యాతి చేరింది.

జిల్లాకు చెందిన రిత్విక శ్రీ అనే 9 ఏళ్ల బాలిక కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి పర్వతంపై జాతీయ జెండాతో పాటు కలెక్టర్ గంధం చంద్రుడు ఉన్న ఫోటోను ప్రదర్శించిందన్న వార్త సామాజిక మధ్యమాలలో దావాలనంలా వ్యాపించింది.

తాడిమర్రి మండలం, ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన కడపల శంకర్ కుమార్తె రిత్విక శ్రీ శుక్రవారం టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. అనంతరం పర్వత శిఖరంపై మాతృ దేశానికి, పర్వతారోహనకు ఆర్థిక సహాయాన్ని అందించిన కలెక్టరు గంధం చంద్రుడుకు కృతజ్ఞతలు తెలుపుకుంది.

9 ఏళ్లకే ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన రిత్వికపై కలెక్టర్ ప్రశంసల జల్లు కురిపించారు. కిలిమంజారో పర్వతంపై తన చిత్రాన్ని ప్రదర్శించడంపై సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఒక కలెక్టరుగా ప్రతిభ ఉన్న చిన్నారికి సాయం చేశానన్నారు. చిట్టితల్లి విజయంలో తనకు కూడా భాగం ఇవ్వడం రిత్విక గొప్పతనం అన్నారు. ప్రతిభ, పట్టుదల, వినయం కలగలిసిన మాణిక్యం రిత్విక అన్నారు.

స్వతహాగా క్రికెట్ కోచ్ అయిన రిత్విక తండ్రి కడపల శంకర్ జిల్లా కలెక్టరుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పర్వతారోహణ చేయడం భారం అవుతుందని కలెక్టరు గారిని సంప్రదించిన వెంటనే ఆర్థిక సహాయం అందించారన్నారు. భారత దేశం నుంచి బయల్దేరినప్పటి నుంచి ఎప్పటికప్పుడు తమ పరిస్థితుల గురించి ఆరా తీసేవారన్నారు. టాంజానియా నుంచి స్వదేశానికి వచ్చిన అనంతరం కలెక్టరు గారిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటామన్నారు.

రిత్విక శ్రీ కిలిమంజారో పర్వతారోహణకు ఆర్థిక సహాయం చేయాలని తండ్రి కడపల శంకర్ కోరడంతో ఈ నెల 1వ తేదీన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.2,98,835 లను కలెక్టర్ గంధం చంద్రుడు చిన్నారికి అందించారు.

…………….
*సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురం వారిచే జారీ…*

About The Author