అన్నం తినేటప్పుడు నీళ్లు తాగొచ్చా?


ఇప్పటికీ సరైన సమాధానం దొరకని ప్రశ్న ఇది. అన్నం తినడానికి గంట ముందు కొంతమంది నీళ్లు తాగమంటారు. మరికొంతమంది వద్దంటారు. అన్నం తినే సమయంలో నీళ్లు తాగకూడదని కొందరు చెబుతారు. అలా తాగడం మంచిదే అంటారు మరికొందరు. అన్నం పూర్తిగా తినేసిన తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదంటారు.
ఇలా అన్నం-నీళ్లకు సంబంధించి భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ విషయంలో వైద్య నిపుణులు, ఆయుర్వేద వైద్యులు చెబుతున్న వాదనలకు అస్సలు పొంతన ఉండదు. ముందుగా అన్నం తినేముందు నీళ్లు తాగాలా వద్దా అనే అంశానికొద్దాం.
అన్నం తినడానికి గంట ముందు నీళ్లు తాగమని వైద్యనిపుణులు చెబుతారు. ఇలా చేయడం వల్ల పొట్ట సాఫీగా మారి, జీర్ణక్రియకు సిద్ధమౌతుందని అంటారు. అయితే ఆయుర్వేద నిపుణులు మాత్రం దీన్ని ఒప్పుకోరు. ఇలా చేయడం వల్ల వ్యక్తులు బలహీనమౌతారని వాళ్లు వాదిస్తున్నారు.
ఇక అన్నం తింటున్నప్పుడు నీళ్లు తాగకూడదని ఇంగ్లిష్ వైద్యులు చెబుతారు. ఇలా అన్నం మధ్యలో నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందనేది వాళ్ల వాదన. ఆయుర్వేద వైద్యులు మాత్రం అన్నం తింటున్నప్పుడు మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు తాగితే తప్పులేదంటారు.
ఇక అన్నం తిన్న తర్వాత నీళ్లు తాగాలా వద్దా అనే అంశం వద్ద మాత్ర అంతా ఏకమయ్యారు. అన్నం తిన్న కాసేపటి వరకు నీళ్లు తాగొద్దని ఇటు ఆరోగ్య నిపుణులు, అటు ఆయుర్వేద వైద్యులు కూడా చెబుతున్నారు. అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగితే బరువు పెరుగుతారనే విషయాన్ని ఇద్దరూ అంగీకరిస్తున్నారు.
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగాలా వద్దా అనే అంశానికి సంబంధించి ఓ కామన్ ఆన్సర్ మాత్రం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. అన్నం తినేముందైనా, అన్నం తింటున్న క్రమంలోనైనా మితంగా (200 మిల్లీ లీటర్లకు మించకుండా) నీళ్లు తీసుకోవచ్చు. అయితే ఈ నీళ్లు కూడా గోరువెచ్చగా ఉంటే మంచిదనేది అందరూ ఆమోదించిన ఆన్సర్.

About The Author