అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్.. ఈ నెల పెన్షన్‌‍లో భారీ కోత


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకునిపోతోంది. అభివృద్ధి పనులతో పాటు.. ఉద్యోగుల జీతభత్యాలకు ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డే స్వయంగా వెల్లడించారు.ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగులకు కొందరికి ఈ నెల పెన్షన్‌లో ఏపీ ప్రభుత్వం కోత విధించింది. ఆదాయపు పన్ను పేరుతో పెన్షన్‌ను కత్తిరించింది. ఈ నేపథ్యంలో రిటైర్డు ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.
దీనిపై ఆర్థికశాఖ అధికారులు మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఇలాంటి కోతను విధించడం సహజమేనని చెప్పారు. చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు వారి సేవింగ్స్ క్లెయిమ్స్ ఇవ్వకపోవడం వల్ల… వారికి కోత ఎక్కువగా ఉండొచ్చని తెలిపారు.
వీరి వివరణపై రిటైర్డు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేవింగ్స్ క్లెయిమ్స్ పంపినా… తమకు చేరలేదని అధికారులు అంటున్నారని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని అన్నారు.
అంతకుముందు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ అప్పులు చేసిన విషయం నిజమేనని చెప్పారు. కరోనా వైరస్ వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందని… ఇదే సమయంలో ఖర్చు బాగా పెరిగిందని తెలిపారు.
ఈ పరిస్థితిని ఒక్క ఏపీ మాత్రమే ఎదుర్కోవడం లేదని… అనేక రాష్ట్రాలు ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కరోనా నియంత్రణ కోసం ప్రతి రోజు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు.
డబ్బు అవసరం ఉన్నందుకే అప్పులు చేశామనే విషయాన్ని గర్వంగా చెప్పగలనని బుగ్గన అన్నారు. తమది సంక్షేమ ప్రభుత్వమని… అందుకే ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరమవుతోందని చెప్పారు. ఈ పథకాల ద్వారా అదే డబ్బును వ్యవస్థలోకి పంపుతున్నామన్నారు.
ప్రభుత్వ చర్యలతో రాష్ట్ర అర్థిక స్థితి మెరుగుపడుతోందని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల వల్ల విమర్శించేందుకు ఏమీ లేక అప్పులు అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.

About The Author