ప్రేమకోసం చావును ఛాలెంజ్ చేశారు.. ఆసుపత్రిలోనే వధూవరులయ్యారు..

ప్రేమకోసం చావును ఛాలెంజ్ చేశారు..
ఆసుపత్రిలోనే వధూవరులయ్యారు..

వాళ్లిద్దరూ వరుసకు బంధువులు.. ప్రేమించుకున్నారు.. ఇరు కుటుంబాల పెద్దలు వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లిన యువకుడు అక్కడే పురుగుల మందు తాగాడు. ఇద్దరూ మృత్యువుతో పోరాడి కోలుకోవడంతో గురువారం ఆసుపత్రిలోనే పెద్దలు వారి పెళ్లి(నిఖా) చేశారు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగింది. ధారూర్‌ మండలం కుక్కిందకు చెందిన నవాజ్‌(23), వికారాబాద్‌ మండలం అత్వెల్లికి చెందిన రేష్మాబేగం(20)లు ప్రేమించుకున్నారు. రేష్మాబేగం సోదరిని కుక్కిందకు చెందిన నవాజ్‌ సోదరునికి ఇచ్చి నిఖా చేశారు. వీరి పిల్లలను ఆడించడానికి రేష్మాబేగం కుక్కింద వెళ్లిన క్రమంలో నవాజ్‌తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని, విషయాన్ని పెద్దలకు చెప్పారు. అక్కాచెల్లెలిని ఒకే ఇంటికి ఇవ్వడం బాగుండదని తిరస్కరించారు. దీంతో మనస్తాపం చెందిన రేష్మాబేగం ఈనెల 8న అత్వెల్లిలోని తన ఇంట్లో పురుగుల మందు తాగింది. ఆమెను వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న నవాజ్‌ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించాడు. తన కోసం ప్రాణాన్ని లెక్క చేయకుండా పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న ప్రియురాలిని చూసి చలించిపోయాడు. రేష్మాబేగం తాగిన పురుగులమందు డబ్బాను వైద్యుడికి చూపించేందుకు తీసుకురాగా దానిని పరిశీలిస్తున్నట్లుగా నటించి, డబ్బాలో మిగిలిపోయిన పురుగుల మందును అందరూ చూస్తుండగానే నవాజ్‌ తాగాడు. ఈ విషయాన్ని వెంటనే వైద్యులకు తెలపడంతో అతనికి చికిత్స అందించారు. మూడు రోజులుగా చికిత్స నిర్వహించిన అనంతరం ఇరువురికీ ప్రాణాపాయం లేదని వైద్యులు కుటుంబ పెద్దలకు చెప్పారు. ఇక జాప్యం చేస్తే బాగుండదన్న అభిప్రాయంతో ఇరువర్గాల పెద్దలు చక్రాల కుర్చీలపై వారిని తీసుకొచ్చి ఆసుపత్రిలోనే పెళ్లి చేశారు

About The Author