మీ తలగడ, పరుపు సౌకర్యంగా ఉన్నాయా?


మనలో చాలామందికి మంచి సౌకర్యవంంతమైన పడక, మన తలగడ ఎలా ఉండాలో తెలియదు. ఇంకా కొందరికైతే వీటి విషయంలో కొన్ని అపోహలూ ఉంటాయి. చాలామంది నిద్ర సమయంలో తలగడ వాడకపోవడమే మంచిదని అనుకుంటుంటారు. వాస్తవానికి మంచి నిద్ర కోసం సరైన తలగడ వాడాలి. రాత్రివేళ నిద్రలో మనం చాలాసార్లు అటు పక్కకూ, ఇటు పక్కకూ తిరగాల్సి వస్తుంది. అలా పక్కకు తిరిగి పడుకున్న సమయంలో తలకూ, పడకకూ మధ్య చాలా గ్యాప్‌ ఉంటుంది.ఆ గ్యాప్‌ కారణంగా సుఖంగా నిద్రపోవడం సాధ్యం కాదు. అందుకే మంచి తలగడను ఉపయోగించడం వల్ల ఆ గ్యాప్‌ లేకుండా చూసుకోవడం సాధ్యమవుతుంది. ఫలితంగా దేహంలో మన తలకూ, మిగతా శరీరానికీ ఒకేలాంటి సమానమైన ఒత్తిడి పడేలా చేసుకోవడం వల్లనే సౌకర్యవంతమైన నిద్రపోవడం సాధ్యమవుతుంది. అయితే ఎంత మంచి తలగడనైనా రెండేళ్లకు మించి వాడకూడదు. ఎందుకంటే రెండేళ్ల తర్వాత తలగడ తన కంప్రెసబిలిటీనీ, ఎలాస్టిసిటీని కోల్పోతుంది. అందుకే కొందరు అప్పటికీ తలగడ ఉన్నా దాని సపోర్ట్‌ సరిపోక మళ్లీ భుజాన్ని కూడా వాడుతుంటారు.

మంచి తలగడ ఎలా ఉండాలంటే…
► తలగడ మృదువుగా భుజాలు, తల పట్టేంత సైజులో ఉండాలి

► తలగడను కేవలం తలకింద మాత్రమే అమరేలా కాకుండా… కొంత భాగం భుజాల కిందికీ వచ్చేలా అమర్చుకోవాలి. దీనివల్ల స్పాండిలోసిస్‌ కారణంగా వచ్చే మెడనొప్పి రాకుండా ఉంటుంది. ఇలా స్పాండిలోసిస్, మెడనొప్పి, భుజాల నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు తమకు అనువుగా ఉండేలా తలగడను ఎంచుకోవాలి. అమర్చుకోవాలి

► కుటుంబంలో ఎవరి తలగడ వారికి వేరుగా ఉండాలి. పిల్లలకు కూడా వాళ్ల తలగడ వాళ్లకే ఉండేలా చూడాలి

► తలగడ మీద ఉండే డస్ట్‌మైట్స్‌తో కొందరికి అలర్జీలూ, ఆస్తమా కూడా రావచ్చు. అందుకే తలగడను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం ఉతికిన పిల్లోకవర్‌ తొడిగిన తలగడనే వాడాలి. పిల్లోకవర్‌ను ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి.

పడక విషయానికి వస్తే… చాలా మంది పరుపు మీద పడుకోవడం మంచిది కాదని అంటారు. వీపునొప్పితో బాధపడే చాలామంది పరుపు వాడకూడదని, గట్టి ఉపరితలం మీద పడుకోవాలని అంటుంటారు. అలాంటివారు చెక్కబల్ల మీద పడుకుంటూ ఉండటమూ చాలా మంది విషయంలో చూస్తుంటాం. వాస్తవానికి అది సరికాదు. నిజానికి మంచి పరుపు మీద పడుకోవడమే మంచిది. అది శరీరానికి గట్టిగా ఒత్తుకోకుండా ఉండేంత మృదువుగానూ ఉండాలి. అదే సమయంలో మనం అందులోకి మరీ కూరుకుపోయేలా కూడా ఉండకూడదు. నిపుణులు చెప్పే ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేక, గట్టి ఉపరితలం మీద పడుకోవాలని అపోహ పడుతుంటారు.

గట్టి ఉపరితలం మీద పడుకుంటే ఒంట్లో చాలా భాగాలు నొక్కుకుపోయి, అలా నొక్కుకుపోయిన చోట్ల నొప్పి వస్తుంది. అందుకే పరుపును ఎంపిక చేసే సమయంలో అది శరీరానికి ఒత్తుకోకుండా మృదువుగా ఉండటంతో పాటు మనం కూరుకుపోకుండా ఉండేలాంటి పరుపును తీసుకోవాలి. పరుపు వాడే సమయంలోనూ ప్రతివారం దాన్ని తిరగవేయడం మంచిది. ఎందుకంటే ఒకేవైపు వాడుతుంటే శరీరం బరువు ఒకేచోట పడి అది తన ఎలాస్టిసిటీని కోల్పోయి, గుంటలా పడుతుంది. అందుకే మార్చి మార్చి వాడాలి. ఒక పరుపును మూడేళ్ల పాటు వాడుకోవచ్చు. ఆ తర్వాత మార్చడమే మంచిది.

About The Author