మాధవి.. ఓ ‘చాలెంజర్‌’ కథ!!

by
ఆధారం లేని జీవితాలు ఎటు కొట్టుకుపోతాయో తెలీదు. అవి నిలబడతాయన్న నమ్మకమూ లేదు. కట్టుకున్నవాడు చిన్న వయసులోనే కన్నుమూసాడు. ఆ సమయంలో అండగా ఉండాల్సిన వారు ఒంటరిని చేసినా బతుకు పోరాటంపై ఆ యువతి నమ్మకం సడలలేదు. ఇద్దరు బిడ్డలను భుజాన వేసుకుని ఒంటరిపోరు సాగించింది. జీవితాన్ని గెలిచిన చాలెంజర్‌ ఆమె. ఇప్పుడు పోటీ పరీక్షల్లో విద్యార్థులను విజేతలుగా నిలుపుతున్న అసలైన విజేత. అచీవర్స్‌ స్టోరీస్‌ సగర్వంగా అందిస్తున్న చాలెంజర్‌ అకాడమీ డైరెక్టర్‌ పసుమర్తి మాధవి సక్సెస్‌ స్టోరీ..

పసుమర్తి మాధవి వైజాగ్‌లో పుట్టారు. పెరిగింది హైదరాబాద్‌లో. తండ్రి దూర్వాసుల జగన్నాథరావు సెక్రటేరియట్‌ ఉద్యోగి. తల్లి జోగులాంబ హిందీ పండిట్‌. మాధవి పదవ తరగతి వరకు సెయింట్‌ థెరిసాస్‌ గర్ల్స్‌ హైస్కూల్లో చదివారు. బీజడ్‌సీ తర్వాత ఇంగ్లీషుపై మక్కువతో ఎంఏ చేశారు. ఫ్రెంచ్‌ బాషలో సర్టిఫికేట్‌ కోర్సు పూర్తి చేశారు. ఎమ్మెస్సీ (ఐటీ) పట్టా కూడా అందుకున్నారు. ఇన్‌ఫెర్టిలిటీ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ రిసర్చ్‌ సెంటర్లో 1996లో రిసర్చ్‌ అసోసియేట్‌గా అవకాశం వచ్చింది. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే అదే ఏడాది ఎన్నారై మూర్తి పసుమర్తితో అక్టోబరులో వివాహమైంది. 1997లో జనవరిలో యూఎస్‌ వెళ్లారు. భర్త ప్రోత్సాహంతో నెట్‌వర్కింగ్‌లో సిస్కో సర్టిఫికేట్‌ చేజిక్కించుకున్నారు. 2001లో భారత్‌ తిరిగొచ్చారు.

హైదరాబాద్‌లో బీఎస్‌పీఎల్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే ఉద్యోగం చేయొద్దని మాధవి అత్త ఆదేశించారు. మూర్తి సైతం తల్లి మాట కాదనలేకపోయారు. ఎంతో కష్టపడి చదువుకున్నా ప్రోత్సాహం లేదంటూ మాధవి మానసికంగా కుంగిపోయారు. 2004లో స్నేహితురాలు జ్యోతి సాయంతో దిల్‌సుఖ్‌నగర్‌లోని లోటస్‌ ల్యాప్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌గా చేరారు. భర్తకు మంచి ఉద్యోగ అవకాశం రావడంతో ఇద్దరు పిల్లలతోసహా 2005లో తిరిగి యూఎస్‌ వెళ్లారు. 2006లో భారత్‌ తిరిగొచ్చారు. మళ్లీ లోటస్‌ ల్యాప్‌ పాఠశాలలో మాధవి చేరారు.

ఆస్పెన్‌టెక్‌ కన్సల్టింగ్‌ పేరుతో ఫైనల్‌ స్కూలింగ్‌ సెంటర్‌ను దిల్‌సుఖ్‌నగర్‌లో 2008లో భర్తతో కలిసి ఏర్పాటు చేశారు. గూగుల్, వెరిజాన్‌ వంటి కంపెనీల ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ఈ కేంద్రం ప్రత్యేకత. మ్యాథమెటిక్స్‌లో మూర్తికి మంచి పట్టు ఉంది. ఆయన కోరిక మేరకు 2010లో చాలెంజర్‌ అకాడమీ రూపుదిద్దుకుంది. అకాడమీలో పిల్లలకు ట్యూషన్లు చెప్పేవారు. తొలి ఏడాది హర్షిణి అనే అమ్మాయికి ఇంటర్‌ ఎంఈసీలో స్టేట్‌ 6వ ర్యాంకు వచ్చింది. ఇదే ఉత్సాహాన్ని నింపింది.

ఏడాది గడవకముందే పెద్ద ఉపద్రవం ముంచుకొచ్చింది. తనకు అండగా ఉన్న భర్త 2011 సెప్టెంబరులో ఈ లోకం విడిచి వెళ్లారు. దీంతో ఆమె కలల సౌధం కుప్పకూలింది. ఇద్దరు ఆడపిల్లలు. చేతిలో చిల్లిగవ్వా లేదు. ఆ సమయానికి తన పేరున బ్యాంకు ఖాతా కూడా లేదు. భర్త సంపాదన అంతా ఆయన తల్లిదండ్రుల చేతుల్లో ఉండేది. ఉద్యోగం చేయాలా, అకాడమీని నడపాలా అన్న సందేహం. అకాడమీ నడిపేందుకే నిర్ణయించారు మాధవి. అమ్మ తరఫువారు ఇచ్చిన రూ.20 వేలతో ఒంటరి పోరు సాగించారు.

కూరగాయలు కొనేందుకు డబ్బులు ఉండేవి కావు. ఒకరోజు పిల్లలకు స్పోర్ట్స్‌ డ్రెస్‌ కోసం అబిడ్స్‌ వచ్చారు. డ్రెస్‌ కొనగా డబ్బులు మిగలలేదు. బస్‌ చార్జీలు లేకపోవడంతో ఇంటికి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. పిల్లల ఫీజులు, సిబ్బంది జీతాల కోసం బంగారాన్ని అమ్మాల్సి వచ్చింది. అకాడమీని విస్తరించేందుకు బంగారాన్ని తాకట్టు పెట్టి లోను తీసుకున్నారు. ప్రముఖ విద్యాసంస్థల్లో పిల్లలిద్దరినీ చదివిస్తున్నారు.

2014లో చాలెంజర్‌ అకాడమీని రిజిష్టర్‌ చేశారు. ఇంజనీరింగ్, మెడికల్‌ లాంగ్‌ టెర్మ్, క్రాష్‌ కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. తొలి ఏడాది 45 మంది చేరారు. 2017లో 95 మంది శిక్షణ పొందారు. రాష్ట్ర స్థాయిలో ఈ సెంటర్‌ నుంచి 309 అత్యుత్తమ ర్యాంకుగా ఉంది. ఇప్పటివరకు 60 మందికిపైగా విద్యార్థులకు మెడికల్‌ సీట్లు దక్కాయి. ఒకే కేంద్రంలో ఇన్ని ర్యాంకులు రావడం విశేషం. బాలురకు, బాలికలకు ప్రత్యేక వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. 25 మంది ఉద్యోగులు ఉన్నారు.

అకాడమీలో పిల్లలకు ఇంటి వాతావరణం ఉంటుందని మాధవి చెప్పారు. ‘అకాడమీ మాకు దేవాలయం. ఇక్కడ విద్యార్థులకు విలువలను నేర్పుతాం. ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి ఉండదు. స్వేచ్ఛా వాతావరణం ఉంటుంది. జీవన శైలి బాగుండేలా విద్యార్థులను తీర్చిదిద్దుతాం. నాయకత్వ లక్షణాలు నేర్పుతాం. క్యారమ్స్, చెస్‌ వంటివి ఆడుకునేలా ఏర్పాటు చేశాం. ఇంటర్మీడియేట్‌ క్లాసులు ప్రారంభించాల్సిందిగా తల్లిదండ్రుల నుంచి విన్నపాలు వస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో దిల్‌సుఖ్‌నగర్‌లోనే ఇంటర్‌ కాలేజీకి ఏర్పాట్లు చేస్తున్నాం. 13,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రం రానుంది’ అని వివరించారు.

ఆత్మస్థైర్యమే నా ఆస్తి అని అంటారు మాధవి. ‘అయినవారు చాలా బాధపెట్టేవారు. రెండో పాప కడుపుతో ఉన్నప్పుడు ఆత్మహత్య ప్రయత్నమూ చేశాను. పెద్ద పాపను ఒకసారి చూసి చనిపోవాలని వెనక్కి వచ్చాను. తప్పు చేస్తున్నానని వెంటనే తేరుకున్నాను. డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు వివేకానందుని పుస్తకాల పఠనం అలవాటు చేసుకున్నాను. అలా ఒడిదుడుకుల మధ్య కొన్నేళ్లపాటు జీవితం కొనసాగింది. కన్నీళ్లు పెట్టుకోవద్దని నా పిల్లలు దివ్య, శ్రీయ కోరారు. వాళ్లే నాకు మెంటార్లు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా ఎలా ఉండాలో వారికి నేర్పాను. సమస్యను ఎదుర్కోవడంలో ఎక్కడా తగ్గొద్దు అని వారికి చెప్పాను’ అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.

ఏడవకపోయినా ఈ సమాజం వేలెత్తి చూపిస్తుందని అంటారామె. ‘మాధవి అంటే స్ట్రాంగ్‌ అంటారు నా స్నేహితులు. నాకూ మనసుంటుంది. నాకూ కన్నీళ్లు వస్తాయి. ఈ నవ్వు వెనుక దాగిన కన్నీళ్లు ఎన్నో’ అని అన్నారు.

జీవిత భాగస్వామిని గౌరవించాలని చెబుతారు ఈ చాలెంజర్‌. ‘ఇంటి దగ్గర జీవిత భాగస్వామి ఎదురుచూస్తారన్న గౌరవం ఉండాలి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వచ్చి సమస్యలను సృష్టించొద్దు. ఏ విషయాల్లోనూ బంధువుల ప్రమేయమూ ఉండొద్దు. పెళ్లి అయిన ఏ ఆడపిల్ల అయినా చిన్నచిన్న సంతోషాలను కోరుకుంటుంది. భర్తతో సంతోషంగా గడపాలని ఉంటుంది. భర్తనే భార్య వెన్నంటి ఉండాలి. జీవితంపట్ల ధైర్యం ఇవ్వాలి. డిప్రెషన్‌కు లోనైతే శారీరకంగానూ మనుషులు వీక్‌ అవుతారు. ఇంట్లో ఉన్నవాళ్లే మంచోళ్లు, బయటకు వెళ్లి ఉద్యోగం చేసేవాళ్లు చెడ్డవాళ్లు అన్న భావన నుంచి మనుషులు కొందరు బయటపడాలి’ అని అంటారు.

హ్యాపీ ఫ్యామిలీ అయ్యేందుకు డబ్బులే ఉండక్కర లేదు. భార్య, భర్త ఒకదారి అయితే భర్త తరఫు వారు మరో దారి. ఈ రెండు దారులూ కలిస్తేనే ఏ ఆడపిల్లకయినా జీవితం ఆనందంగా ఉంటుంది. అవి కలవకపోతే నరకమే. ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు చూస్తుంటే మనసు కలిచివేస్తుంది. ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్లకుండా ఎవరికివారే మనసుకు ధైర్యం తెచ్చుకోవాలి. ఆ సంఘర్షణ నుంచి బయటపడాలి. ప్రతి ఆడపిల్లకు ఇదే నా సందేశం. కష్టమొస్తే ఎలా ఎదుర్కోవాలో ప్రతి ఆడపిల్లకు తల్లిదండ్రులే నేర్పాలి’ అని తన మనసులో మాట చెప్పారు.

చాలెంజర్‌ ప్రయాణంలో ఒక్కో మెట్టు జాగ్రత్తగా ఎక్కాం. ఒక విద్యార్థి చేరగానే ఒక చైర్‌ కొనేవాళ్లం. ఉదయం 4.30కి మొదలై రాత్రి 11 వరకు శ్రమించాను. విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించాలన్న ప్రయత్నంలో విజయవంతం అయ్యాం. ఇందుకు మా ర్యాంకులే నిదర్శనం. సొంత భవనం నిర్మించాలన్న కోరిక ఉంది. విస్తరణ కోసం భాగస్వాముల వేటలోనూ నిమగ్నమయ్యాం’ అని మాధవి చెప్పారు.

మాధవి పెద్దమ్మాయి దివ్య డెలాయిట్‌లో ఉద్యోగం సాధించారు. కవితలు రాయడం ఆమె హాబీ. దివ్య ప్రోత్సాహంతోనే అచీవర్స్‌ స్టోరీస్‌ ముందుకు వచ్చారు మాధవి.

(మాధవి జీవితంలో ఎన్నో సంఘటనలు ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పిస్తాయి. ఉమ్మడి, సంపన్న కుటుంబంలో ఆమెది ప్రతిరోజూ బతుకు పోరాటమే. ఆమె కోరిక మేరకు ఆ వివరాలను ఇక్కడ ఇవ్వడం లేదు. ఈ చాలెంజర్‌ నవ్వు వెనుక దాగిన కన్నీళ్లు ఎన్నో. ఆటుపోట్లు మరెన్నో. అన్నిటికీ నిలబడి ఒంటరి పోరు సాగిస్తున్న ఈ విజేత కథ ఎందరికో స్ఫూర్తి కలిగిస్తుందన్నది నా విశ్వాసం)

About The Author