జీజీహెచ్‌లో నేరుగా గాలి నుంచే ‘ఆక్సిజన్’ ఉత్పత్తిచేసే ప్లాంటు
జిల్లాలో కోవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాకినాడ జీజీహెచ్‌లో నేరుగా గాలి నుంచే వైద్య అవసరాల కోసం ఆక్సిజన్‌ను ఉత్పత్తిచేసే ప్లాంటును ప్రారంభించినట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం కాకినాడ ఎంపీ వంగా గీత, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తదితరులతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కాకినాడ జీజీహెచ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత రోజుకు 1700 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించిన మంత్రి అనంతరం అదనపు ఆక్సిజన్ పడకల విభాగంతో పాటు అంతర్గత ఫార్మసీ స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటు వివరాలను వెల్లడించారు. కోవిడ్ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న బాధితుల ప్రాణాలను రక్షించడంలో ఆక్సిజన్ చాలా కీలకమైందని, ఈ నేపథ్యంలో ప్రస్తుత, భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మెడికల్ ఆక్సిజన్ నిల్వలను పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా మెడికల్ ఆక్సిజన్‌కు కొరత లేకుండా చూస్తున్నామన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి జిల్లాకు ఆక్సిజన్‌ను సరఫరా అవుతోందని, వివిధ కారణాల వల్ల ఆక్సిజన్ సరఫరాకు అవాంతరాలు ఏర్పడితే అత్యవసర సమయంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు జీజీహెచ్‌లో సొంతంగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటును అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రూ.కోటి 20 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంటు ద్వారా రోజుకు 1700 లీటర్ల మేర ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయొచ్చన్నారు. Pressure Swing Adsorption(పీఎస్ఏ) సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నేరుగా గాలి నుంచి ఈ ప్లాంటు ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయొచ్చని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, అడిషనల్ డీఎంహెచ్‌వో డా. ఎన్.ప్రసన్నకుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఆర్.మహాలక్ష్మి, ఆర్ఎంవో డా. ఇ.గిరిధర్, ఆక్సిజన్ ప్లాంట్ ఇన్‌ఛార్జ్ జి.వివేకానంద తదితరులు పాల్గొన్నారు.