కరోనా వాక్సిన్ రిజిస్టర్ చేసుకోండి
హద్దుపద్దు లేకుండా కోవిడ్ విజృంభిస్తున్న వేళ దాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ పైనే ఆశలు పెట్టుకున్నాయి. జనవరి 16న ప్రారంభమైన టీకా కార్యక్రమంలో తొలి విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకు టీకాలు వేశారు. రెండో దశలో ప్రస్తుతం 45 ఏళ్లు దాటినవారికి టీకాలు వేస్తున్నారు. వ్యాక్సినేషన్ ను మరింత ముమ్మరం చేసేందుకు మే ఒకటో తేదీ నుంచి మూడో దశ కార్యక్రమం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విడతలో 18 ఏళ్లు దాటినవారికి టీకాలు వేస్తారు. టీకా వేసుకోదలచినవారు ఈ నెల 28 నుంచి తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుందని నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ ఎస్ శర్మ తెలిపారు.
రిజిస్టర్ చేసుకునే విధానం
టీకా కోసం పేర్లు నమోదు చేసుకోవాల్సినవారు మొదట cowin.gov.in వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ ఫోన్ కు ఎస్సెమ్మెస్ ద్వారా ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫై అనే బట్టన్ క్లిక్ చేయాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సిన్ అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఇతర వివరాలు నమోదు చేయాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలుంటే ఆ వివరాలు కూడా నమోదు చేయాలి. అన్నీ సరిచూసుకున్న తర్వాత అదే పేజీ కుడివైపున ఉన్న రిజిస్టర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు మీ సెల్ ఫోన్ కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. పేజీలో మీ వివరాలన్నీ కనిపిస్తాయి. వాటిని సరి చూసుకున్న తర్వాత షెడ్యూల్ అపాయింట్మెంట్ అనే ఆప్షన్ ద్వారా మీరు టీకా వేయించుకునే తేదీ కూడా ఎంచుకోవచ్చు. ఒకే ఫోన్ నంబరుపై మరో ముగ్గురి పేర్లు కూడా నమోదు చేయవచ్చు. అందుకోసం యాడ్ మోర్ అనే ఆప్షన్ ఎంచుకొని వారి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు వేసుకోవాలో తెలియజేస్తూ మీకు మెసేజ్ వస్తుంది. అయితే గర్భిణులు, పాలిచ్చే తల్లులు టీకా వేసుకోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో ఉచితంగానే టీకా
18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా టీకా వేసేందుకు మొదట కేంద్రం ముందుకు రాలేదు. ఆయా రాష్ట్రాలు లేదా పౌరులు కొనుగోలు చేసి వేసుకోవాలని ప్రకటించింది. దీనిపై వెంటనే స్పందించిన ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందరికి ఉచితంగా టీకాలు వేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత కేంద్రం కూడా దిగివచ్చి రాష్ట్రాలకు తామే ఉచితంగా టీకాలు సరఫరా చేస్తామని ప్రకటించింది. దాంతో ఒకటో తేదీ నుంచి మూడో విడత టీకా కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం జగన్ నేరుగా టీకా ఉత్పత్తి సంస్థలైన సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ ఎండీ లతో మాట్లాడి రాష్ట్రానికి అవసరమైన టీకాలను ప్రథమ ప్రాధాన్యంగా అందించాలని కోరారు.