‘నాతో పాటు చెల్లెలి ఫొటోలు కూడా పంపాను’


విద్య(పేరు మార్చడమైనది) పదవ తరగతి చదువుతోంది. ఫోన్‌లో వచ్చిన మెసేజ్‌లు చూసి, తెగ నవ్వుతుంటే తల్లి మందలిస్తూనే ఉంది. అవేమీ పట్టించుకోని విద్య ఫోన్‌ చూస్తూ భోజనం ముగించి, తన రూమ్‌కి వెళ్లిపోయింది. ‘ఏం పిల్లలో ఏమో..’ అనుకుంటూ తల్లి పనిలో పడిపోయింది. ఫేస్‌బుక్‌లో తన ఫొటోకు వచ్చిన లైక్‌లు చూసుకుంటూ, సంబరపడిపోతూ విద్య, స్నేహితులతో చాట్‌ చేస్తూ కూర్చుంది. కొత్తగా వచ్చిన ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ చూసి వెంటనే యాడ్‌ చేసుకుంది. ఆ రిక్వెస్ట్‌ తన క్లాస్‌మేట్‌ రమ్యది. వారం రోజులుగా రమ్యతో చాట్‌ చేస్తూ ఉంది.
ఓ రోజు.. విద్య కత్తితో తన చేయి మణికట్టు మీద కట్‌ చేసుకుంది. తల్లి తండ్రి కంగారు పడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎందుకు చేశావీపని అంటే ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని విషయమంతా వివరించింది. విద్య చెప్పింది విన్న తల్లిదండ్రులు షాక్‌కి లోనయ్యారు. విద్యకు ఆన్‌లైన్‌లో పరిచయం అయిన వ్యక్తికి తన ఫొటోలే కాకుండా, చెల్లెలు డ్రెస్‌ మార్చుకుంటుండగా తీసిన ఫొటోలు ఆ బ్లాక్‌మెయిలర్‌కు షేర్‌ చేయాల్సిన పరిస్థితిని చెప్పి, తల్లిని పట్టుకుని ఏడ్చేసింది విద్య. ఇప్పుడా ఫొటోలు ఆన్‌లైన్‌లో షేర్‌ చేస్తానని చెబుతూ డబ్బుల కోసం తనని బెదిరిస్తున్నాడని చెప్పింది. తన క్లాస్‌మేట్‌ ఫేస్‌బుక్‌ నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చిందని, తన క్లాస్‌మేటే అనుకుని చాట్‌ చేస్తున్నానని, ఆ బ్లాక్‌మెయిలర్‌ తనకు తెలియదంది. విద్య తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

టార్గెట్‌ టీనేజర్స్‌
ఇన్వెస్టిగేట్‌ చేసిన పోలీసులు సదరు బ్లాక్‌మెయిలర్‌ను పట్టుకున్నారు. అతని టార్గెట్‌ అంతా 13 –18 ఏళ్ల అమ్మాయిలని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. కేవలం టీనేజ్‌ అమ్మాయిల ప్రొఫైల్స్‌ చూస్తూ, వాటిలోని సమాచారాన్ని చదివి, ఫేక్‌ అకౌంట్లు తెరుస్తుంటాడు. ఆ అకౌంట్‌ నుంచి సదరు అమ్మాయిల క్లాస్‌మేట్స్‌కి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపుతుంటాడు. ఒక సారి యాడ్‌ చేసుకోగానే రోజూ ఉదయమే ‘హాయ్‌..’తో సంభాషణ మొదలుపెడతాడు. అవతలి వ్యక్తి తన క్లాస్‌మేట్‌ అమ్మాయే కదా అనుకొని ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ యాడ్‌ చేసుకున్న అమ్మాయి చాట్‌ చేస్తుంటుంది. దీంతో, సదరు వ్యక్తి మంచి భాషా నైపుణ్యంతో మాటలు పెంచి, ఫ్రెండ్‌షిప్‌ చేస్తాడు.

ఆ తర్వాత వ్యక్తిగత సమాచారమంతా తెలుసుకుని, అదను చూసి మానసికంగా దగ్గరవుతాడు. ఆ తర్వాత శరీరాకృతి గురించి, వ్యక్తిగత ఫొటోలు షేర్‌ చేయడం వరకు వెళుతుంది. అమ్మాయి బాగుంటే ఫిజికల్‌గా, లేదంటే డబ్బు గురించి ట్రాప్‌ చేయడం మొదలుపెడతాడు. ఇవేవీ లేదంటే, ఇంట్లో ఆడవాళ్లు బాత్రూమ్‌లో ఉన్న ఫొటోలు, స్నేహితుల న్యూడ్‌ ఫొటోలు పంపించమని బెదిరిస్తాడు. ఒకసారి ట్రాప్‌ అయితే ఇక ఏదో ఒక సమస్యలో ఆ అమ్మాయి ఇరుక్కోవాల్సిందే. ఇలాగే ఆ బ్లాక్‌ మెయిలర్‌ వందల మందిని ఫేక్‌ అకౌంట్‌ ద్వారా మోసం చేశాడు.

ఆన్‌లైన్‌ మోసగాళ్లు
సైబర్‌ నేరస్థులు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నకిలీ ప్రొఫైల్స్‌ను సృష్టించి, ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపుతుంటారు. ఒకసారి స్నేహం మొదలయ్యాక వ్యక్తిగత కథనాలను జోడిస్తారు. నమ్మకాన్ని, సానుభూతిని పొందుతారు. బాధితురాలికి నమ్మకం కలిగించడానికి, మొదట తమ ఫొటోలను పంపుతారు. కొన్నిసార్లు నగ్న చిత్రాన్ని పంపుతారు. మంచి ఫొటో, వీడియోలను పంపమని ప్రేరేపిస్తారు. అవి తమకు చేరిన తర్వాత బ్లాక్‌ మెయిల్, దోపిడీ ప్రారంభమవుతుంది. సరైన ఫోటోలు, వీడియోలను పంపకపోతే మార్ఫింగ్‌ పద్ధతిని ఎంచుకుంటారు. దోపిడీ ద్వారా వారికి డబ్బు రాకపోతే, వారు ఈ దుర్మార్గపు నెట్‌వర్క్‌లోకి ఇతర వ్యక్తులను లాగడానికి ఈ ఫొటోలను ఎరగా వాడుతారు.

నకిలీ ఖాతాల గుర్తింపు..

ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ల సంఖ్య ఆకస్మికంగా పెరుగుతుంది ∙అవతలి వ్యక్తి ప్రొఫైల్‌ తేదీ గమనించాలి ∙చూడాల్సింది పేరు, ప్రొఫైల్‌ పిక్‌ కాదు. ప్రొఫైల్‌ను తనిఖీ చేయాలి. ∙ఆ ఫ్రొఫైల్‌లో పోస్టులు ఏమేం ఉన్నాయో చూడాలి.
ఒక కారణం కోసం విరాళాలు కోరడం/ అత్యవసర పరిస్థితుల్లో రుణాలు కోరడం వంటివి ఉన్నాయేమో గమనించండి.
ఆన్‌లైన్‌ రొమాన్స్‌కు సంబంధించి చిత్రాలు ఉన్నాయేమో చూడండి.
సోషల్‌ మీడియాను సురక్షితంగా..

మీకు బాగా పరిచయం ఉన్న, నమ్మకం ఉన్న వ్యక్తులతో మాత్రమే కనెక్ట్‌ అవ్వండి.
వారి నిజాయితీని ధృవీకరించుకోకుండా ఆన్‌లైన్‌ చాటింగ్, డేటింగ్‌ వంటివి చేస్తూ మానసికంగా చేరిక కాకూడదు.
సన్నిహిత/ స్పష్టమైన చిత్రాలు లేదా వీడియోలను ఆన్‌లైన్‌లో ఎప్పుడూ షేర్‌ చేయవద్దు
వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ పంచుకోకూడదు (ఫోన్‌ నెంబర్, ఉన్న ప్లేస్‌.. మొదలైనవి)
అలాగే, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై మీ పూర్తి సమాచారాన్ని ఎప్పుడూ పంచుకోవద్దు. (ఫైనాన్షియల్, లాగిన్‌ క్రెడెన్షియల్స్‌ – ఆర్గనైజేషన్‌.. వంటివి)
బ్యాక్‌గ్రౌండ్‌ పూర్తిగా చెక్‌ చేసిన తర్వాతే సోషల్‌ మీడియా స్నేహితులను వ్యక్తిగతంగా కలవండి.
మీ ప్రతి సోషల్‌ మీడియా ఖాతాకు ప్రత్యేకమైన, సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను (ప్రత్యేక అక్షరాలు) ఉపయోగించండి. వాటిని తరచూ మారుస్తూ ఉండండి.
అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయడం మానుకోండి.
కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రులకు సరైన కమ్యూనికేషన్‌ ఉంటే ఇలాంటి సమస్యలు దరిచేరవు. టీనేజ్‌ అమ్మాయిలు సోషల్‌ మీడియా వేదికగా జరిగే మోసాలకు బలవకుండా మొదట్లోనే కనిపెట్టి, అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కుటుంబసభ్యులదే.

About The Author