నా పిల్లలను నువ్వే చూడాలిరా తమ్ముడూ అని కాల్ రికార్డు చేసి..
‘నాకు పక్షవాతం.. నా భార్యకు కడుపునొప్పి మమ్ములను సరిగ్గా చూస్తే బతికేవాళ్లమేమో.. నా అనారోగ్యమే నాకు బతకాలనే ఆశ లేకుండా చేసింది.. మేము ఎవరికీ భారం కావొద్దని చనిపోతున్నాం.. నాకు ఇద్దరు బిడ్డలు నా పిల్లలను నువ్వే చూడాలిరా తమ్ముడూ మల్లేశా’ అంటూ ఫోన్‌లో రికార్డు చేసి దంపతులిద్దరూ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడారు. ఈ ఘటన మెదక్ పట్టణంలోని గాంధీ నగర్‌లో శనివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.కడమంచి రాములు (54), కడమంచి లక్ష్మి (48) దంపతులు చాలా ఏళ్ల క్రితం మెదక్ నుంచి బతుకు దెరువు కోసం కామారెడ్డికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కామారెడ్డిలో పాత ఇనుప సామగ్రి వ్యాపారం చేసుకొని జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు గతంలోనే పెళ్లిళ్లు చేసి పంపారు. రాములుకు ఏడాది క్రితం పక్షవాతం వచ్చి కాలు చేతి పని చేయలేని పరిస్థితి. భార్య లక్ష్మికి కిడ్నీలో రాళ్లు ఉండి తరచూ కడుపు నొప్పితో బాధపడేది. ఉన్నదంతా వైద్యానికి ఆస్పత్రులకు ఖర్చు పెట్టారు. అసలే రెక్కల కష్టం ఆధారంగా బతుకు బండిలాగే వారికి కరోనా మరో ఇబ్బందిగా మారింది. కనీసం అప్పు ఇచ్చేవారు కూడా లేకపోవడంతో ఆరు నెలల క్రితం మెదక్‌లోని గాంధీ నగర్‌లో ఉండే తన తమ్ముడి వద్దకు వచ్చారు. చిన్నపాటి అద్దె ఇంట్లో ఉండి ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. అయినా బాగు కాకపోవటంతో శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో ఎందుకు చనిపోతున్నామో ఫోన్‌లో రికార్డు చేసి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తీయకపోవటంతో మృతుడి తమ్ముడు మల్లేశం పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి తలుపులు పగులకొట్టి చూడగా ఫ్యానుకు ఉరివేసుకొని విగత జీవులుగా కనిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం తరలించి కేసు దర్యాపు చేన్నట్లు తెలిపారు.